BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆయనకు స్టేషన్ ఘన్‌పూర్‌ బాధ్యతలు అప్పగింత

by Shiva |   ( Updated:2024-04-14 15:16:41.0  )
BREAKING: లోక్‌సభ ఎన్నికల వేళ కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆయనకు స్టేషన్ ఘన్‌పూర్‌ బాధ్యతలు అప్పగింత
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకే స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రవల్లి ఫాం హౌజ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆయన కూతురు కడియం కావ్యకు హస్తం పార్టీ వరంగల్ టికెట్‌ను కట్టబెట్టింది. అయితే, అప్పటి వరకు కాంగ్రెస్‌లో చేరానుకున్న రాజయ్య ఒక్కసారిగా తన ఆలోచన మార్చుకున్నారు.

ఈ క్రమంలోనే గులాబీ బాస్ సైతం బీఆర్ఎస్‌లోకి రావాలంటూ రాజయ్యను స్వయంగా ఆహ్వానించారు. ఒకనొక దశలో ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింగి. కానీ, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉద్యమకారుడు మారేపల్లి సుధీర్ కుమార్‌ను కేసీఆర్ నిర్ణయించారు. అప్పటి వరకు తనకే ఎంపీ టికెట్ వస్తుందని ఆశించిన రాజయ్య కాస్త డీలా పడిపోయారు. కాగా, కేటీఆర్ హామీ, కేసీఆర్ ఆహ్వానం మేరకు ఇవాళ ఎర్రవల్లి ఫాం హౌజ్‌లో జరిగిన సమావేశానికి రాజయ్య హాజరయ్యారు. సమావేశంలో భాగంగా ఆయనకు తిరిగి స్టేషన్ ఘన్‌పూర్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్‌ను గెలిపించాలని రాజయ్యకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు ఖాయమని అన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేసేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అదేవిధంగా స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు.

Advertisement

Next Story