సింగరేణి ఎన్నికలకు బ్రేక్..! మూడు నెలల వాయిదా తప్పదా?

by Sathputhe Rajesh |
సింగరేణి ఎన్నికలకు బ్రేక్..! మూడు నెలల వాయిదా తప్పదా?
X

దిశ, కరీంనగర్​ బ్యూరో : సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మరోమారు వాయిదా పడ్డాయి. మూడేళ్ల నిరీక్షణ తరువాత ఎన్నికలకు మోక్షం కలిగిందని అందరూ భావించగా తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో మరో మూడు నెలల వాయిదా పడ్డట్లు భావిస్తున్నారు. గుర్తింపు కార్మిక సంఘం పదవీ కాలం పూర్తి కావడంతో ఎన్నికలు నిర్వహిస్తే తమ సమస్యలను యాజమాన్యంతో చర్చిస్తారని భావించిన కార్మికులకు నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 2వ తేదీన ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేయడానికి ప్రాంతీయ లేబర్​ కమిషనర్​తో పాటు కేంద్ర లేబర్​ ఉప కమిషనర్​ సిద్ధం అవుతుండగా హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

మార్చి13వ తేదీన సింగరేణి ఎన్నికల నిర్వహణపై హైదరాబాద్​ ప్రాంతీయ లేబర్​ కమిషనర్​ కార్యాలయం, కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్​ సమావేశం నిర్వహించి ఏప్రిల్​ 2న ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా ఎన్నికల విషయంలో సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈనెల 17, 21వ తేదీన వాదనలు జరగకుండా కేసు వాయిదా పడగా ఈనెల 23న హైకోర్టు జూన్​ 1వ తేదీ తరువాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోంది.

ఏప్రిల్​లో ఎన్నికల నోటిఫికేషన్​ ఎండాకాలం కావడంతో మొదటి త్రైమాసికంలో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఉత్పత్తి తగ్గుతుందని సింగరేణి యాజమాన్యం అంటోంది. జూన్​ నెలలో వర్షాలు కురుస్తాయి కాబట్టి ఉత్పత్తికి అంతరాయం కలుగుతుందని అలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సంస్థకు మేలు జరుగుతుందని అంటుంది.

అనేక మలుపుల మధ్య..

గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అనేక మలుపుల తర్వాత ముందడుగు పడిందని భావించారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం తెలంగాణలో పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం, ఖమ్మం, ఆసిఫాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉన్నది. సింగరేణి సంస్థకు మొత్తం 11డివిజన్లు ఉండగా 2017 లో చివ‌రిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో బీటీఆర్ఎస్ అనుబంధ సంఘ‌మైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తొమ్మిది డివిజన్లలో జయకేతనం ఎగరేసి గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది. ఎన్నికైన సంఘం పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది.

సంఘం ప్రతినిధులను కార్మికులకు సంబంధించిన సమస్యలపై, కార్మికుల సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాల విషయంలో సమావేశానికి ఆహ్వానిస్తుంది. 2017 ఎన్నికల సమయంలో కాల పరిమితి నాలుగేళ్లు ఉంటుందని ప్రకటించినప్పటికీ తరువాత రెండేళ్ల కాల పరిమితి అని ప్రకటించారు. షెడ్యూల్​ ప్రకారం గడువు రెండేళ్లు అంటే 2019 సెప్టెంబర్‌లో ముగిసిపోయింది. రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణపై యాజమాన్యం అసక్తి చూపకపోవడంతో కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.

జాతీయ కార్మిక సంఘాలు సైతం పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి ఎన్నికలు నిర్వహించాలని ఆందోళనలు చేపట్టాయి. ఎన్నికలు నిర్వహించాలని ఐఎన్​టీయూసీ హైకోర్టును ఆశ్రయించడంతో 2022 అక్టోబర్​ 28వ తేదీన ఇచ్చిన తీర్పులో వెల్లడించింది. హైకోర్టు తీర్పుతో పాటు గుర్తింపు కార్మిక సంఘాల ఒత్తిడితో ఎన్నికల నిర్వహణకు కార్మిక శాఖ ముందుకు వచ్చినప్పటికీ గురువారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఎన్నికల ప్రక్రియ మరో మూడు నెలల పాటు వాయిదా పడ్డట్లు అయింది. ​

ఏప్రిల్ 2న సమావేశంపై అందరి దృష్టి..

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల షెడ్యూల్​ విడుదల చేస్తామని ప్రాంతీయ లేబర్​ కమిషనర్​తో పాటు కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్​ ఈనెల13వ తేదీన ప్రకటన చేశారు. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వులతో సింగరేణిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయినట్లు భావిస్తున్న తరుణంలో ఏప్రిల్​ 2న జరిగే సమావేశం నిర్వహిస్తారా లేక వాయిదా వేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు అధికార బీఆర్​ఎస్​ పార్టీ సుముఖంగా లేకపోవడంతోనే సింగరేణి యాజమాన్యం ద్వారా హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తీసుకువచ్చిందని గుర్తింపు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి చెందితే వచ్చే శాసనసభ ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో దాని ప్రభావం ఉంటుందని భావించి ప్రభుత్వం ఎన్నికల విషయంలో సహాయ నిరాకరణ పద్ధతిని అవలంబిస్తూనే ఉత్పత్తి పేరుతో ఉత్త మాటలు చెబుతుందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Next Story