వాళ్లే టార్గెట్‌.. బీజేపీ మరో సరికొత్త ప్లాన్

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-29 02:52:23.0  )
వాళ్లే టార్గెట్‌.. బీజేపీ మరో సరికొత్త ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఓబు బ్యాంకు పెంచుకునే వ్యూహానికి శ్రీకారం చుట్టింది. అన్ని రంగాల ప్రజలకు చేరువయ్యేందుకు కాషాయదళం ఇప్పుడు నూతన మార్గాలను అన్వేషిస్తోంది. అటు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన స్టార్ తో వరుస భేటీలు నిర్వహించారు. పైకి సాధారణ సమావేశమని చెబుతున్నప్పటికీ.. రాజకీయ, సామాజిక అంశాలపై చర్చలు జరిపినట్లు తేటతెల్లమైంది. నిన్నటి వరకు సెలబ్రెటీలను కలిసిన కమలనాథులు ఇప్పుడు రూట్ మార్చారు. ఇప్పుడు తాజాగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులను కూడా పార్టీలోకి చేర్చుకుని ఎవరికీ అంతుచిక్కని వ్యూహంతో దూసుకెళ్తున్నారు.

ఐటీ హబ్ గా హైదరాబాద్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రపంచంలోనే ఉన్నత టెక్ దిగ్గజ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన ఉద్యోగులు దాదాపు 5 లక్షలకు పైచిలుకు ఉన్నారనేది పలు నివేదికల ఆధారంగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో సెటిలయ్యారు. ఐటీ రంగానికి చెందిన నిపుణులను బీజేపీలోకి చేర్చుకోవడంపై నేతలు దృష్టిసారించగా.. వందల సంఖ్యలో ఉద్యోగులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. వీరిని ప్రభావితం చేయడం ద్వారా వారి కుటుంబీకులు, బంధువులను కూడా బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయాలనే టార్గెట్ ను బీజేపీ పెట్టుకుంది. హైదరాబాద్ లో కేవలం తెలంగాణకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన టెక్కీలు కూడా ఉద్యోగరీత్యా ఇక్కడ సెటిలయ్యారు. వారిని అప్రోచ్ అవ్వడం ద్వారా వారి సొంత రాష్ట్రాల్లో కూడా ఎంతో కొంత ప్రభావితం చేయొచ్చని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందుకే ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా ప్రతి వర్గానికి దగ్గరై పార్టీలోకి చేర్చుకుంటోంది.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సంసిద్ధమవుతోంది. ఏ రంగానికి చెందిన ప్రముఖులను కలుపుకుని పనిచేస్తే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కలిసొస్తుందే అనే అంశంపై రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు హైకమాండ్ కు నివేదికలు, సమాచారం చేరవేస్తోంది. అందులో భాగంగానే ఇటీవల టాలీవుడ్ అగ్రనటుడు ఎన్టీఆర్.., కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడితో మరో స్టార్ నితిన్, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయ అంశాల ప్రస్తావన జరిగినట్లు తెలిసిందే. కాగా నితిన్, మిథాలీ రాజ్ బీజేపీతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తంచేసినట్లు కాషాయదళం చెబుతోంది. ప్రచారానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులంతా తమతోనే ఉన్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపించి బీజేపీ బలాన్ని మరింత పెంచుకోవడంపై నేతలు దృష్టిసారిస్తున్నారు. ఇదిలా ఉండగా త్వరలో మునుగోడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే ఈ స్టార్లు బైపోల్ లో ప్రచారానికి దిగుతారా? లేక సాధారణ ఎన్నికల సమయానికి ప్రచారం ప్రారంభిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : రాశిఫలాలు : రియలెస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు తప్పవు

Advertisement

Next Story

Most Viewed