ఇక సమరమే.. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీలపై బీజేపీ కీలక నిర్ణయం!

by GSrikanth |   ( Updated:2023-03-20 23:30:20.0  )
ఇక సమరమే.. TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీలపై బీజేపీ కీలక నిర్ణయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. 30 లక్షల మంది నిరుద్యోగుల సమస్య కావడంతో ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఇక సమరమే అని యుద్ధానికి సిద్ధమవుతోంది. లీకేజీ వ్యవహారంలో బీజేపీ ఇప్పటికే టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా ఆ కమిటీ లీకేజీలకు సంబంధించిన అంశాలపై, నిరుద్యోగుల సమస్యలపై ఆరా తీసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లీకేజీ వ్యవహారంలో టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని బీజేపీ అనుబంధ సంస్థలు ముట్టడించాయి. ఏబీవీపీ, బీజేవైఎం నేతలు భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపట్టారు. టీఎస్ పీఎస్సీ ముట్టడించిన బీజేవైఎం నేతలను జైలుకు సైతం పంపించారు. నిరుద్యోగుల సమస్య కావడం, బీజేవైఎం నేతలను జైలుకు పంపడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్‌తో తెలంగాణ రాష్ట్రం కోసం యువత ఉద్యమించింది. అలాంటిది స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా వేసిన కొన్ని నోటిఫికేషన్లకు కూడా లీకేజీ జరగడంపై కమలనాథులు సీరియస్‌గా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలని ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నారు. వర్సిటీల వారీగా అభిప్రాయాల సేకరణ చేపట్టాలని కాషాయదళం నిర్ణయం తీసుకుంది. అంతేకాకండా జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేసుకుంది. నిరుద్యోగుల సమస్యలను తెలుసుకునేందుకు హైదర్ గూడలో కానీ అశోక్ నగర్‌లో కానీ కార్యాలయం ఏర్పాటు చేయనుంది. నేరుగా అక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చని సూచిస్తోంది. ఎక్కువ శాతం నిరుద్యోగ యువత ఈ ప్రాంతంలోని కోచింగ్ సెంటర్లలోనే ఉంటుండటంతో అక్కడే ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది.

మంత్రి కేటీఆరే లీకేజీకి బాధ్యుడని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్‌తో బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం దీక్షలు చేపట్టారు. ఇదిలా ఉండగా నిరుద్యోగుల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ అశోక్ నగర్‌లో కానీ, హైదర్ గూడలో కానీ ప్రత్యకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ ఇక్కడి వరకు నేరుగా వచ్చి ఫిర్యాలు చేయలేని వారికోసం హెల్ప్ లైన్ సెంటర్‌ను కూడా ప్రారంభించనుంది. ఇదిలా ఉండగా అన్ని వర్సిటీల్లో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి వారికి తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తామన్న నోటిఫికేషన్లు ఎన్ని? తొమ్మిదేండ్లలో భర్తీ చేసింది ఎన్ని? అనే అంశాలపై వివరించనుంది. విద్యార్థుల అభిప్రాయాన్ని సైతం తీసుకోనుంది. మళ్లీ వర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మరోసారి గుర్తుచేయనుంది. నిరుద్యోగ సమస్యలపై బీజేపీ చేపడుతున్న పోరాటాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయి? నిరుద్యోగులకు ఎంత వరకు రీచ్ అవుతుందనేది వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story