అత్యంత బలమైన కేడర్ ఉన్న ఆ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి.. కారణాలేంటి?

by GSrikanth |   ( Updated:2023-12-12 04:01:36.0  )
అత్యంత బలమైన కేడర్ ఉన్న ఆ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి.. కారణాలేంటి?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓటమి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది . ఈ నియోజకవర్గంలో మొత్తం 11 డివిజన్లు ఉండగా 9 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. క్షేత్ర స్థాయిలో ఎంతో పటిష్టంగా ఉండడంతో ఇక్కడి నుండి పోటీ చేసిన సామ రంగారెడ్డి విజయం ఖాయమని అందరూ అంచనా వేశారు. అయితే ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా రావడం అందరిని ఆలోచించేలా చేసింది. ఎక్కడ తేడా వచ్చింది? పార్టీకి చెందిన కార్పొరేటర్లు అందరూ అభ్యర్థి విజయం కోసం పని చేయలేదా ? ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగి సొంత పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచారా ? అనే చర్చ నియోజకవర్గం వ్యాప్తంగా వినబడుతోంది. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి సామరంగారెడ్డి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తొమ్మిది డివిజన్లలో పార్టీ కార్పొరేటర్లు ఉన్నా ఎందుకు చతికిల పడింది, ఓటమికి గల కారణాలను పార్టీ నాయకత్వం విశ్లేషిస్తోంది. తాజా ఎన్నికలలో సుధీర్ రెడ్డికి 1,11,380 రాగా బీజేపీ నుండి పోటీ చేసిన సామరంగారెడ్డికి 89,075 సాధించారు. నియోజకవర్గానికి అంతగా పరిచయం లేని కాంగ్రెస్ నేత మధు యాష్కిగౌడ్ 83,273 ఓట్లు పొందడం గమనార్హం.

లోపించిన సమన్వయం:

ఎల్బీ నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, పార్టీ కార్పొరేటర్ల మద్య సమన్వయం లోపించందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో కావాలనే కొంత మంది కార్పొరేటర్లు పాల్గొనలేదని, పాల్గొన్న వారు కూడా తూతూ మంత్రంగా ప్రచారం చేశారని, అభ్యర్థి గెలుపుకు పూర్తి స్థాయిలో పని చేయలేదనే టాక్ వినబడుతోంది. క్షేత్ర స్థాయిలో కార్పొరేటర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలను కలుపుకుని ముందుకు పోవాల్సిన అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుసగుసలు వినబడుతున్నాయి. వారి మద్య ఉన్న అంతర్గత విభేధా లు ఫలితాలను తారు మారు చేశాయి . ఎల్బీ నగర్ ని యోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఉన్న పట్టు ఆ పార్టీ గెలిచిన కార్పొరేటర్ల సంఖ్య చూస్తేనే అర్థం అవుతుండగా ఓటమి పాలుకావడం చర్చనీయాంశంగా మారింది.

రెండవ స్థానంతో సరి:

ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ రెండవ స్థానంలో నిలిచింది. సుమారు 22,305 ఓట్ల తో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు . నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ముందుకు వచ్చి ప్రచారంలో దూకుడు కనబరచి ఉంటే ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉండేవి. దీనికితోడు వ్యూహాత్మకంగా ప్రచారం చేయకపోవడం కూడా ఓటమికి కారణంగా కనబడుతోంది. ఎన్నికల ప్రచారంలో భా గంగా ప్రతి కాలనీ, బస్తీలలో పాదయాత్ర చేయవలసి ఉండగా చాలా చోట్ల బీజేపీ శ్రేణులు ప్రచారమే నిర్వహించలేదు. కనీసం ఓటర్లను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో పార్టీకి ఓటు వేయాలనే అభిమానం ఉన్నా ఓటర్లు ఇతర పార్టీలకు ఓట్లు వేశారు. డివిజన్లలో అభ్యర్థిని తీసుకువచ్చి ప్రచారం నిర్వహించాల్సిన కార్పొరేటర్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

గ్రేటర్ ఎన్నికలపై ప్రభావం..?

శాసనసభ ఎన్నికల ఫలితాలు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దీనిని రుజువు చేస్తున్నాయి. 2018 ఎన్నికలలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసి విజయం సాధించినప్పటికీ తర్వాత 2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికలలో 11 డివిజన్లను బీజేపీ గెలుచుకుంది. అనంతరం లింగోజీగూడ కార్పొరేటర్ మరణించడంతో డివిజన్ కు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించగా ఇటీవల బీజేపీ కార్పొరేటర్ ఒకరు బీఆర్ఎస్ లో చేరడంతో వీరి సంఖ్య 9కి తగ్గింది. నియోజకవర్గంలో ఇంత మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నా ఎమ్మెల్యే సీటును గెలుచుకోకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాగే కొనసాగితే మరో ఏడాది తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ కార్పొరేటర్లు తిరిగి విజయం సాధించడం అంత సులువు కాదనే టాక్ వినబడుతోంది.

Read More : కలిసిపోనున్న బీఆర్ఎస్, బీజేపీ.. చర్చకు దారితీసిన ఎమ్మెల్సీ కవిత!

Advertisement

Next Story

Most Viewed