- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కవితను కాపాడుకోడానికే కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు: బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడం ఖాయమనే భయం కేసీఆర్‌ను నిద్రపోనివ్వడంలేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఆమె అరెస్టు కాకుండా కాపాడుకోడానికి పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం ఈ స్కామ్‌లో భాగంగా అరెస్టు కాగానే కేసీఆర్ ఉలిక్కి పడ్డారని, అందుకే ఆయన అరెస్టును ఖండించారని గుర్తుచేశారు. సొంత కూతురిపై ఆరోపణలు వస్తే మౌనంగా ఉన్న కేసీఆర్ ఎనిమిది పార్టీల నాయకులతో మాట్లాడి విపక్షాల తరఫున ప్రధానికి ఆగమేఘాల మీద లేఖ రాశారని, కనీసం అందులో సంతకాలు కూడా లేవని అన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు నిరసనగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఒక రోజు దీక్ష సందర్భంగా బండి సంజయ్‌పై వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కామ్‌లో కవిత పరిస్థితి ఏమవుతుందో అని కేసీఆర్‌కు భయం పట్టుకున్నదని సంజయ్ వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్‌లో ఆమెపై స్పష్టమైన అభియోగాలను సీబీఐ, ఈడీ సంస్థలు వాటి చార్జిషీట్లలో పేర్కొన్నాయని, ఆ తర్వాత మనీష్ సిసోడియా అరెస్టు కావడంతో ఇక ఇబ్బందులు తప్పవనే ఆందోలనతో ప్రధానికి లేఖ రాసే డ్రామాను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సంతకాలు లేకుండా లేఖ రాయడంలోని ఆంతర్యం కేసీఆర్‌కే తెలియాలన్నారు. సిసోడియా అరెస్టును ఖండించిన కేసీఆర్ తన సొంత కూతురి విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. కూతురిని మంచి దారిలో పెట్టుకోలేని కేసీఆర్ ఇప్పుడు సీబీఐ, ఈడీ సంస్థలను, ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం విడ్డూరంగా ఉందన్నారు.
కోటి సంతకాల సేకరణ :
లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని, కానీ తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అవినీతిని మాత్రం దేశవ్యాప్తంగా బహిర్గతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఎనిమిది పార్టీలకు చెందిన తొమ్మిది మందితో కలిసి ప్రధాని లేఖ రాసిన వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, తొమ్మిదేళ్ళలో తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం చేసిన దోపిడీ, పాల్పడిన అవినీతిపై కోటి సంతకాలను సేకరిస్తామని, ఆ తర్వాత ఆ చిట్టాను రాష్ట్రపతికి పంపుతామన్నారు. త్వరలోనే రాష్ట్రపతిని కూడా కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకుంటామని, కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరెవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసని, ఇప్పటికే అనేక ఫిర్యాదులు కూడా వెళ్ళాయని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే బీజేపీ తెలంగాణలోని అవినీతి పాలనను అంతం చేయకుండా విశ్రమించేదే లేదన్నారు.
కవిత వాచీకున్న విలువ కూడా ప్రీతి ప్రాణానికి లేదా?
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, నిత్యం అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి చనిపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కేసీఆర్ కనీసం స్పందించలేదని, ఆడబిడ్డలకు రాష్ట్రంలో లభిస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మాటలే తప్ప చేతల్లేని కేసీఆర్ రాష్ట్రంలో రోజుకో మర్డర్, పూటకో అత్యాచారం జరుగుతున్నా స్పందించడంలేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళల మీద అఘాయిత్యాలు చేస్తే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేస్తున్నరని గుర్తుచేసిన సంజయ్... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ పాలసీని అమలుచేస్తామన్నారు.
ప్రీతీ చనిపోయిన కేసును ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన బండి సంజయ్ ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న పీజీ విద్యార్థి సైఫ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బాధితురాలైన ప్రీతి ప్రభుత్వం దృష్టిలో విలన్‌గా మారారని, వేధింపులకు గురిచేసిన సైఫ్ మాత్రం హీరో అయ్యారని అన్నారు. ప్రీతీ ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదంటూ ఆమె తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారని పేర్కొన్నారు. స్వయంగా తాను బాదితురాలి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించానని గుర్తుచేశారు. ప్రీతి చనిపోయిన తర్వాత ఆమె ఫింగర్ ప్రింట్స్ తో పోలీసులు ఆమె ఫోన్‌ను ఓపెన్ చేసి వాట్సాప్‌లోని చాటింగ్ హిస్టరీని డిలీట్ చేశారని సంజయ్ ఆరోపించారు. నిమ్స్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ పేరుతో ప్రభుత్వం డ్రామా నడిపించిందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చేతికి పెట్టుకునే వాచ్ విలువ సుమారు రూ. 20 లక్షలు అని, కానీ పీజీ చదువుతున్న ప్రీతి చనిపోతే ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా మాత్రం రూ. 10 లక్షలు అని బండి సంజయ్ గుర్తుచేశారు. కవిత పెట్టుకునే వాచికి ఉన్నంత విలువ కూడా వైద్య విద్యార్థి ప్రీతి ప్రాణానికి లేదని విమర్శించారు. ప్రీతి మృతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతున్నదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రీతి ఎలా చనిపోయిందో ఇప్పటివరకూ స్పష్టత లేదన్నారు. చివరికి ఆమె కుటుంబ సభ్యులకు సైతం కడసారి చూపు చూసుకునే అవకాశాన్ని కల్పించకుండా ఆదరా బాదరాగా అంత్యక్రియలు జరిపించారని విమర్శించారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి సీఎం కేసీఆర్‌కు ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు.