స్ట్రీట్ కార్నర్స్‌పై బీజేపీ నిఘా.. ఒక్కో సెగ్మెంట్‌లో డైలీ 100 సభలు

by Mahesh |
స్ట్రీట్ కార్నర్స్‌పై బీజేపీ నిఘా.. ఒక్కో సెగ్మెంట్‌లో డైలీ 100 సభలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బూత్ స్థాయికి పార్టీని తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలనే లక్ష్యంతో బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నది. దీని కోసం నేతలకు 15 రోజులు టార్గెట్‌ను విధించింది. ఈ 15 రోజుల్లో 11 వేల వీధి సభలు నిర్వహించాలని కాషాయ పార్టీ డిసైడ్ అయింది. ఈనెల 10వ తేదీ నుంచి ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగులు ప్రారంభమయ్యాయి. 25వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 11 వేల సభలంటే ప్రతి రోజు సగటున రాష్ట్ర వ్యాప్తంగా 733 సభలు నిర్వహించాల్సి ఉంది.

కాగా ప్రతి నియోజకవర్గంలో స్ట్రీట్ కార్నర్ మీటింగులను కచ్చితంగా నిర్వహిస్తున్నారా లేదా అనే అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ ప్రత్యేక టీమ్‌లను నియమించారు. ప్రతిరోజు ఏయే సెగ్మెంట్లలో స్ట్రీట్ కార్నర్ మీటింగులు జరిగాయి? జరిగితే ఎన్ని సభలు నిర్వహించారు? ఏయే సెగ్మెంట్లలో జరగలేదు అనే వివరాలపై బన్సల్ ఆరా తీస్తున్నారు.

స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహణపై బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి బన్సల్ పోస్ట్‌మార్టం ప్రారంభించారు. ఎక్కడ చేపట్టడం లేదో ఆ ప్రాంతాలకు సంబంధించిన నివేదికలు ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. ప్రతి సెగ్మెంట్‌కు ముఖ్య అతిథులను పంపించింది. కాగా ఉప్పల్, బెల్లంపల్లి, పెద్దపల్లి మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ జరగకపోవడంపై బన్సల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వహణ కమిటీ సభ్యులకు వార్నింగ్ కూడా ఇచ్చారు.

వీధి సభల అంశాన్ని నిర్లక్ష్యం వహిస్తే టికెట్ రాదనే విషయాన్ని నేతలకు క్లియర్‌గా చెప్పండని ఆదేశించారు. లీడర్లు ఎవరనే అంశం కూడా చూడకుండా నివేదికలు సిద్ధం చేయాలని బన్సల్ ఆ టీమ్‌కి స్పష్టమైన ఆదేశాలు చేసినట్లు తెలుస్తున్నది. బూత్ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నేత వరకు జవాబుదారేనని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

వీధి సభలు ఉండేది 15 రోజులు మాత్రమేనని, ఇపుడు కష్టపడకుంటే ఇన్ని రోజుల శ్రమ వృథాయేనని బన్సల్ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగులకు సంబంధించిన డెయిలీ రిపోర్టులపై నివేదికలు తయారు చేసేందుకు పలు టీములను ఆయన సిద్ధం చేసుకున్నారు. కాగా వారంతా విడివిడిగా రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా దీనిపై బ్యాక్ ఎండ్‌లోనూ పలు బృందాలు పనిచేస్తున్నాయి.

ప్రతి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు సంబంధించిన డయాస్ ఫొటో, జనాలు ఉన్న ఫొటో పంపించాల్సిందేనని హైకమాండ్ ఆదేశించింది. దీంతో నేతల పనితనమేంటనేది, వారికి లోకల్‌గా ఎంత బలముందనేది తెలుసుకోవచ్చనేది హైకమాండ్ ఆలోచనగా తెలుస్తున్నది. దీన్ని బట్టి నేతలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిపోర్ట్ సైతం తయారు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో నేతల పనితీరు ఆధారంగా టికెట్ కేటాయించడమా లేదా అనేది తేలుతుందనేది బీజేపీ నేతలు చెబుతున్నారు. పూర్ పర్ఫార్మెన్స్ ఉన్నవారిని పక్కన పెట్టేసే యోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలోనూ ఈ వీధి సభల ఆధారంగా జిల్లా, రాష్ట్ర కమిటీలో పార్టీ మార్పులు చేర్పులు చేపట్టింది. ఆ తర్వాత వీక్‌గా ఉన్న ప్రాంతాల్లో పార్టీ స్ట్రాంగ్‌గా తయారైందరి. కాగా ఇక్కడ కూడా అలాగే చేపట్టే అవకాశమున్నట్లు టాక్. గతంలోనూ రాష్ట్ర, జిల్లా కమిటీలో మార్పులుంటాయని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఆయా జిల్లాల్లో నేతల పనితీరుపై రిపోర్టు సైతం పార్టీ పెద్దల వద్ద ఉన్నట్లు సమాచారం. వీధి సభల నిర్వహణకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిపోర్టునూ.. కమిటీ మార్పులు, చేర్పులకు పార్టీ ముడిపెట్టింది. మరి రాష్ట్రవ్యాప్తంగా నేతలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్‌ను సక్సెస్ చేస్తారా లేదా లైట్ తీసుకుని కమిటీ బాధ్యతలకు దూరమవుతారా అనేది చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed