మునుగోడుకు 'నడ్డా'.. ఆ విషయంలో టీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదా?

by GSrikanth |   ( Updated:2022-10-23 00:01:12.0  )
మునుగోడుకు నడ్డా.. ఆ విషయంలో టీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈనెల 31వ తేదీన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించే మరుసటి రోజే బీజేపీ సభను నిర్వహించనుంది. వరుస సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇప్పటికే బీజేపీ శ్రేణులు అక్కడే ఉండి తమ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారాన్ని చేస్తున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులోనే మకాం వేశారు. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఇకనుంచి అదే నియోజకవర్గంలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఆరు నూరైనా గెలవాల్సిందేనని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించి తీరాలనే కసితో కార్యకర్తలు కృషి చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. వచ్చే ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుండటంతో ఇరు పార్టీలకు గెలుపు అనివార్యంగా మారింది. ఈ బైపోల్‌లో పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉండనుంది. ఈ రెండు పార్టీల నడుమ కాంగ్రెస్‌ నలిగిపోతోంది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హోరోహోరీగా ప్రచారంలో శ్రేణులు పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే గులాబీ దండును మునుగోడులోనే మోహరింపజేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా అక్కడే ఉండి వారి సొంత నియోజకవర్గాల్లో కూడా ఎన్నడూ చేపట్టనంతగా ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. ఇక బీజేపీ కూడా అదే స్థాయిలో కోమటిరెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రతిరోజు నియోజకవర్గంలోని పలు మండలాల్లో 10 నుంచి 12 వరకు సభలు నిర్వహిస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి ప్రధాని మోడీ, అమిత్​షాకు గిఫ్ట్‌గా ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నారు.

బైపోల్ ప్రచారం చివరి అంకానికి చేరుతున్న తరుణంలో పార్టీ నుంచి వరుసగా ముగ్గురు నేతలు వీడటంపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. దీనికి దెబ్బకు దెబ్బ కొట్టేందుకు శ్రేణులు సిద్ధమయ్యాయి. నేతలంతా ఏకమై గెలవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 24వ తేదీన దీపావళి ఉన్నా మునుగోడులోనే చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏకంగా మునుగోడులో ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. బండి సంజయ్ కూడా మొత్తం మునుగోడుకే పరిమితమైనా అటు ప్రచారం, ఇటు ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందేననే కసితో కమలదళం ఉన్నారు. వాస్తవానికి మునుగోడు ప్రచారానికి నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, యోగి ఆదిత్యనాథ్‌ను కూడా తీసుకురావాలని శ్రేణులు భావించాయి. కాగా ఇటీవల టీఆర్ఎస్ నేతలు మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టడంపై హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే ఆయన్నే పంపించి గెలుపును కైవసం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రచారం నవంబర్ 1వ తేదీన ముగుస్తున్నా ఆరోజు సాయంత్రం 4 గంటల వరకే అవకాశం ఉండటంతో 31కి అయితేనే బాగుంటుందని శ్రేణులు భావించాయి. అందుకే 31నే సభ పెట్టేందుకు సిద్ధమయ్యాయి. 31న ముగింపు సభకు నడ్డా రానుండటంతో ప్రచారం మరింత హీటెక్కనుంది. నేతలు సమన్వయం చేసుకుంటూ సభ సక్సెస్ చేయాలని రాష్ట్ర నాయకత్వం కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసింది.

పార్టీ నుంచి వీడటంపై ఆగ్రహంగా ఉన్న హైకమాండ్ ఇంకా ఎవరైనా అలాంటి వారు ఉంటే వెంటనే గుర్తించాలని రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించినట్లు సమాచారం. అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నేతలకెవరైనా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వచ్చి లక్ష్మణ్​కు తమ గోడును వివరించుకునేందుకు రాష్ట్ర నాయకత్వం కూడా అవకాశం కల్పించినట్లు టాక్. తద్వారా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమంగా బలపడుతున్న తరుణంలో నేతల మధ్య విభేదాలు తలెత్తడం పార్టీకి డ్యామేజ్ అవుతుందనే కారణంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed