200 మిలియన్ టన్నుల స్టీల్ ఉంటేనే ఫ్యాక్టరీ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

by Javid Pasha |   ( Updated:2023-04-11 15:04:50.0  )
200 మిలియన్ టన్నుల స్టీల్ ఉంటేనే ఫ్యాక్టరీ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే కనీసం 200 మిలియన్ టన్నుల స్టీల్ నిక్షేపాలు ఉండాలని, కానీ బయ్యారంలో ఉన్నది కేవలం 5 మిలియన్ టన్నుల స్టీల్ నిక్షేపాలు మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ గొప్ప విజ్ఞాని, బీజేపీ నేతలు అజ్ఞానులు అన్నట్టుగా అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అమెరికాలో చదివినంత మాత్రాన మిగతా వాళ్లను చులకన చేసి మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటీఆర్ తల, తోక లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన నిద్రలో కూడా అదాని, ప్రధానిని కలవరిస్తున్నారన్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తెరిచే దిక్కులేదని, అలాంటిది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు.

వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారని, ఆ హామీ ఇచ్చి ఎన్నేండ్లు పూర్తయిందని ఆయన ప్రశ్నించారు. హెచ్ఎంటీ, ఐడీపీఎల్, అజంజాహీ మిల్ మాటేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ భూములపై బీఅర్ఎస్ నేతలు కన్నేశారని లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హయాంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి లేకపోవడంతో దిగుమతి చేసుకొనేవారని, వారికి కావాల్సిన బొగ్గు నిక్షేపాలు ఇచ్చేసి బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ కూరుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. బయ్యారం ప్రమేయం లేకుండా కడప స్టీల్ ప్లాంట్ నడుస్తోందని, కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఎన్ఎండీసీ ద్వారా ఎవరైనా బొగ్గు నిక్షేపాలు కొనుగోలు చేయొచ్చని లక్ష్మణ్ స్పష్టంచేశారు. బైలాదిల్ల ద్వారా విదేశాలకు బొగ్గు ఎగుమతి చేస్తున్నామని, జపాన్ కంపెనీ బొగ్గు కొనుగోలు చేస్తోందన్నారు. ఇందులో అదానికి, జపాన్ కంపెనీ కి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన పాలసీ తెచ్చారా? అని ఆయన ప్రశ్నించారు.

నల్లగొండలో యురేనియం పుష్కలంగా ఉందని, అక్కడ నిక్షేపాలను వెలికి తీస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని గుర్తుచేశారు. వీటికి దిక్కు లేదు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళ్తారా? అని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి కేటీఆర్.. చుట్టూ మందిని పెట్టుకొని అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని కొల్లగొడతమంటే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ మాట్లాడిన భాషను ఆంధ్ర ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని, ఆయన వారిని విమర్శించి విశాఖ స్టీల్ అంటూ మోసం చేయాలని చూస్తున్నారన్నారు. జాతీయ పార్టీ అని చెప్పిన కేసీఆర్.. ఏ ఒక్క చోటా ఎందుకు పోటీ చేయలేదో సమాధానం చెప్పాలని లక్ష్మణ్​డిమాండ్ చేశారు. ఏపీలో పార్టీ సింబల్ కే బీఆర్ఎస్ కు దిక్కు లేదని ఘాటు విమర్శలు చేశారు.

Also Read..

2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేయండి: కాంగ్రెస్

Advertisement

Next Story

Most Viewed