అప్రమత్తం చేసినా పట్టించుకోరా.. ఆదివారం వచ్చి పర్యటిస్తా: Bandi Sanjay

by GSrikanth |   ( Updated:2023-07-28 15:35:01.0  )
అప్రమత్తం చేసినా పట్టించుకోరా.. ఆదివారం వచ్చి పర్యటిస్తా: Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందని.. ముందే మేల్కొని ఉంటే ఇంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదనన్నారు. రాష్ట్ర అధికారులు కష్టపడుతున్నా.. సర్కార్ నుండి ఆశించిన సహకారం లేదని ప్రశ్నించారు. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగేదాకా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలెందుకు తీసుకోలేకపోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం క్షమించరానిదని, దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లుగా సర్కార్ తీరు ఉందన్నారు. వరదలపై సీఎం కేసీఆర్ ఇంతవరకు నోరెత్తలేదని ప్రశ్నించారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.20 లక్షలు, అలాగే వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. యుద్ద ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఆదివారం నియోజకవర్గంలో పర్యటిస్తా:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తెలంగాణలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. ఇప్పటికే 20 మంది చనిపోయారని, మరో 25 మంది గల్లంతైనా.. ఇంతవరకు వారి ఆచూకీ లేదన్నారు. వేలాది సంఖ్యలో పశువులు చనిపోయాయని, ఇండ్లు మునిగిపోయాయని లక్షల ఎకరాల్లో పంట, ఆస్తి నష్టం జరిగింది. రోడ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల వల్ల మరణాలు సంభవించాయే తప్పా.. ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నడూ చనిపోయిన దాఖలాల్లేవని అన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ముంపు బాధిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు. అంతేగాక, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed