BJP Mahila Morcha: తెలంగాణ సంస్కృతిపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్

by Gantepaka Srikanth |
BJP Mahila Morcha: తెలంగాణ సంస్కృతిపై విషం చిమ్ముతున్న కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్ హిందువులపై, తెలంగాణ సంస్కృతిపై విషం చిమ్ముతోందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి విమర్శలు చేశారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలకు వివిధ జిల్లాల నుంచి మహిళలు తరలివచ్చారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎంఐఎం చేతిలో పోలీస్ వ్యవస్థ కీలుబొమ్మలా మారిందనేందుకు ఇది నిదర్శనమని ఆమె తెలిపారు. మహిళలకు అమలుకాని హామీలిచ్చి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆడబిడ్డల బతుకమ్మ వేడుకలను పక్కనపెట్టడం తెలంగాణ సంస్కృతిని, మహిళాలోకాన్ని అవమానించడమేనని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోకుండా ఆంక్షలు విధించడం దుర్మార్గమైన చర్యగా తెలిపారు.

తెలంగాణ పోరాట చరిత్రను తప్పుదోవ పట్టించేలా, సంస్కృతిని కించపర్చేలా కుట్ర జరుగుతోందని శిల్పారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు హిందూ పండుగలంటే ఎందుకింత కడుపు మంటనో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పాతబస్తీ పాకిస్తాన్ లోనో, బంగ్లాదేశ్ లోనే లేదనే విషయం గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఆడబిడ్డలంటే, మహిళల పండుగలంటే అలుసని, మహిళలపై వివక్ష చూపుతూ వారిపై అనుచితంగా దూషించడం ఆ పార్టీ నాయకులకు పరిపాటిగా మారిందని ఫైరయ్యారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, సినీ ప్రముఖులపై, నటి వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే దురుసు భాష, విమర్శలతో అవమానాలకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనం వహించడం తగదన్నారు. మహిళలను అవమానించినా, హిందూ పండుగలపై విద్వేషం కక్కినా తీవ్ర పరిణామాలుంటాయని శిల్పారెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed