కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం.. బీజేపీ నేత హెచ్చరిక

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-13 06:42:01.0  )
కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం.. బీజేపీ నేత హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా జిల్లాకు వస్తున్న కేసీఆర్ ను అడ్డుకుని తీరుతామని బీజేపీ హెచ్చరించింది. ఆగస్టు 14న వికారాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, అనంతరం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే స్థానిక నేతలు కసరత్తు చేస్తుండగా.. కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తాండూరులో మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఆ తర్వాత విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరుకు కేటాయించిన మెడికల్ కాలేజ్ వికారాబాద్ కు కేటాయించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. హామీని నిలబెట్టుకోలేక పోయిన సీఎంను తాండూరు ప్రజలు అడ్డుకోవాలని బీజేపీ నేతలు పిలుపునివ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో రేపటి కేసీఆర్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మునుగోడు కంటే ముందే జిల్లాలకు

మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో ముందుగా సీఎం ఆ ప్రాంతంలోనే పర్యటిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన ఆగస్టు 14 నుండి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17న మేడ్చల్-మల్కాజిగిరిలో ఆ తర్వాత వరుసగా మరికొన్ని జిల్లాల్లో పర్యటించి సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడం, బహిరంగ సభల్లో ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. అయితే నేరుగా మునుగోడులోనే పర్యటిస్తే ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తారనే అపవాదు వస్తుందని ఇలాంటి ప్రచారానికి చెక్ పెట్టేందుకే ముందుగా ఇతర జిల్లాల నుంచి కేసీఆర్ తన పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నెల 20న మునుగోడులో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా పరిణామంతో ఇక్కడ ఉప ఎన్నిక ఖాయం అయింది. ఈ ఉప ఎన్నిక ద్వారా మరోసారి ప్రజలకు టీఆర్ఎస్ ఆవశ్యకతను, మునుగోడు ప్రజలపై వరాల జల్లును కురిపించే ఛాన్స్ ఉంది.

మునుగోడులో బీజేపీ కొత్త ఎత్తుగుడ.. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేలా వ్యూహం

Advertisement

Next Story

Most Viewed