రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే అభిమానం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-05-18 08:45:55.0  )
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే అభిమానం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కుటుంబ పరిపాలన పోవాలనే బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారుతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాల తర్వాత గతంలో కలిసి పని చేసిన కాంగ్రెస్ నాయకుల్లో కొంత మంది మిత్రులు తనను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్న మాట నిజమేనన్నారు.

అయితే తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరుతానని ఎక్కడా చెప్పకపోయినా తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో గెలుస్తుందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే గుజరాత్‌లో బీజేపీ గెలిస్తే కర్ణాటకలో ఎందుకు గెలవలేకపోయిందన్నారు. కర్ణాటక రాజకీయం వేరు తెలంగాణ రాజకీయం వేరు అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూప్ తగాదాలు ఉన్నాయని.. ఆ పార్టీలోని నేతల మధ్య ఐక్యత లేదన్నారు. తలోదారిలో పాదయాత్రలు చేస్తున్నారని అలాంటి పార్టీలో తాను చేరడం ఏంటని విమర్శించారు. తనకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎలాంటి వ్యతిరేకత లేదని.. సోనియా, రాహుల్ గాంధీలు అంటే అభిమానం ఉన్నా.. కేసీఆర్ కుటుంబ పాలన పోవాలంటే జాతీయ స్థాయిలో బలహీనపడిన కాంగ్రెస్‌తో అది సాధ్యం కాదనే బీజేపీలో చేరానన్నారు. తాను పదవికి, పార్టీకి ధైర్యంగా రాజీనామా చేసి మునుగోడు ప్రజల సమక్షంలోనే బీజేపీ కండువా కప్పుకున్నానని గుర్తు చేశారు.

రాజకీయంగా ఎదుర్కోలేక మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయానని తనపై తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడి మునుగోడులో గెలిచినా అక్కడ నైతిక గెలుపు మాత్రం తనదేనన్నారు. ఆర్టీఐ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించాడని అలాంటి వ్యక్తి తాను అమ్ముడుపోయానని దుష్ప్రచారం చేశాడని అన్నారు. నిజంగా తాను అమ్ముడుపోయే వ్యక్తినే అయితే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తనకు ఎన్నో సార్లు ఆఫర్లు ఇచ్చినా నేను పోలేదన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో అనేక మార్పులు వస్తాయని అన్నారు. మునుగోడులో తాను ఓడిపోయిన దానికంటే కొంత మంది స్వార్థం కోసం తనపై అపనిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాలో వస్తున్న దుష్ప్రచారం తెలంగాణ ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు ఓ వైపు తాను పార్టీలోకి కీలక వ్యక్తులతో చర్చలు చేస్తుంటే మరోవైపు తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Also Read..

బీజేపీకి ఈటల రాజీనామా.. క్లారిటీ ఇదే!

బిగ్ న్యూస్: అధికారమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ భారీ ప్లాన్!

Advertisement

Next Story