నియోజకవర్గంలోనే జేజమ్మ.. సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్!

by GSrikanth |   ( Updated:2023-05-29 06:47:19.0  )
నియోజకవర్గంలోనే జేజమ్మ.. సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది చివర్లో జరగబోయే ఎన్నికలకు గద్వాల జేజమ్మ పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతున్నారా? కర్ణాటక ఎన్నికల అనంతరం ఫుల్ ఫోకస్ తన అసెంబ్లీ నియోజకవర్గంపైనే పెట్టారా? కొద్దిరోజులుగా సెగ్మెంట్ కే పరిమితమై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆ ఎలక్షన్ తర్వాత తన ఫుల్ ఫోకస్ గద్వాల నియోజకవర్గంపైనే పెట్టినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా అసెంబ్లీ సెగ్మెంట్‌కే పరిమితమన ఆమె ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని డీకే అరుణ భావిస్తున్నారు. అందుకే కొద్ది రోజులుగా గద్వాల నియోజకవర్గంలో తన పనిని తాను సీరియస్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. సెగ్మెంట్‌లో తన బలాన్ని పెంచుకోవాలని ప్రణాళికలు చేస్తున్నారు. అందుకుగాను తన సెగ్మెంట్ పరిధిలో ప్రతి గ్రామానికి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. ‘పల్లె పల్లెకు బీజేపీ’ పేరుతో గత కొద్దిరోజులుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. గ్రామాలవారీగా పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కమలం గుర్తును తెలిసేలా పార్టీ జెండా ఆవిష్కరణలు చేస్తూ డీకే అరుణ ముందుకు సాగుతున్నారు. గతంలో తనకు ఎదురైన ఓటమి ఈసారి ఎన్నికల్లో ఎదురవ్వకుండా ఉండేందుకు పూర్తి సమయాన్ని సెగ్మెంట్‌కే కేటాయించాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నిల తర్వాత తెలంగాణ బీజేపీ నేతల్లో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని పలువురు ప్రచారం చేశారు. కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి పలు ఫిర్యాదులు సైతం చేశారు. అయినా డీకే అరుణ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. తెలంగాణలో పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితిపై పలువురు నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని కోరినప్పటికీ పార్టీ లైన్‌కు కట్టుబడి ఆమె పనిచేస్తున్నారు. పార్టీకి నష్టం కలిగించే ఎలాంటి పనులకు చేయొద్దని వివాదాలకు దూరంగా ఉంటూ బ్యాలెన్స్‌డ్‌గా ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన అంతిమ లక్ష్యమని, కాషాయ జెండా ఎగురువేయడమే ధ్యేయంగ డీకే అరుణ ప్రజలకు చేరువవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed