జీవో 37ను సర్కారు పూర్తిగా సవరించాలి.. సీఎస్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి లేఖ

by GSrikanth |
జీవో 37ను సర్కారు పూర్తిగా సవరించాలి.. సీఎస్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: హెటిరో ఫార్మా సంస్థకు చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల భూ కేటాయింపు నిర్ణయాన్ని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తప్పుపట్టారు. రాజకీయ అవసరాల కోసం తక్కువ ధరకు లీజుకు ఇవ్వడాన్ని చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి నెలలో పక్కన పెట్టారని, రెండు నెలల్లోనే మళ్ళీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన జీవో (నెం. 571/ 14.9.2012) ప్రకారం మార్కెట్ ధరలో 10% మేర లీజు రేట్ ఫిక్స్ చేయాలన్న నిబంధన ఉన్నదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాటించలేదని మంగళవారం రాసిన ఐదు పేజీల లేఖలో పేర్కొన్నారు. ఆ జీవో స్ఫూర్తిని తప్పనిసరిగా పాటించాలని కోరారు.

గత ప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ. 2 లక్షల చొప్పున లీజు ధరను నిర్ణయించి ఖానామెట్‌లో మొత్తం 15 ఎకరాలను 30 ఏండ్ల లీజుకు కేటాయించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ధరను రూ. 5 లక్షల చొప్పున ఖరారు చేసిందని మహేశ్వర్‌రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతి ఏటా 5% మాత్రమే లీజు ధరను పెంచేలా ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొన్నదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత మార్కెట్ ధరను ప్రభుత్వ అధికారులు ఈ 15 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 505 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేశారని పేర్కొన్నారు. ఆ ప్రకారం మార్కెట్ రేటులో 10% మేరకు ఒక్కో ఎకరానికి రూ. 50 కోట్ల చొప్పున లీజు ధరను నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయినందున ఖజానాపై మరింత భారం పడకుండా ఆలోచించాలన్నారు.

జీవో 671 ప్రకారం ప్రభుత్వ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు నిర్దిష్టమైన మార్గదర్శకాలను పాటించాలన్నది ఒక నిబంధన అని పేర్కొన్నారు. సాయి సింధు ఫౌండేషన్‌కు ప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ. 5 లక్షల చొప్పున మాత్రమే లీజు ధరను ఫిక్స్ చేసినందున జీవో స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షం మాత్రమే కాక ఇల్లీగల్, ఉద్దేశపూర్వకంగా తీసుకున్నదని మహేశ్వర్‌రెడ్డి ఆ లేఖలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు నష్టం రావడమే కాక ప్రైవేటు సంస్థకు మితిమీరిన లాభం చేకూరుతున్నదని, దాన్ని సంపన్నం చేయడానికే దోహదపడుతున్నదని అన్నారు. ఒక ప్రైవేటు సంస్థకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయం అన్యాయమైనదన్నారు.

గత ప్రభుత్వం ఆలోచించిన విధంగానే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ప్రైవేటు సంస్థ లాభం గురించే ఆలోచిస్తున్నదని, రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ నేతలు వారి సొంత ప్రయోజనానికే ప్రాదాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం గత నెల 14న ఇచ్చిన జీవో (నెం. 37)ను పూర్తిగా సవరించి జీవో 571 నిబంధనల మేరకు ఒక్కో ఎకరానికి రూ. 50 కోట్ల లీజు ధరను ఫిక్స్ చేయాలని, ప్రతీ ఐదేండ్లకోసారి 10% చొప్పున ధరను పెంచాలని ఆ లేఖలో ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారులు నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్ర ఖజానాను, ప్రజల సంక్షేమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ పెద్దల ఆదేశాలకు తల ఊపే విధానాలను విడనాడాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed