- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ చీఫ్ నడ్డా సడెన్ విజిట్.. పార్టీలో వర్గపోరును అరికట్టేందుకేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ క్రమంగా పుంజుకోవాలని ప్లాన్ చేస్తోంది. త్వరలో స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో మెంబర్ షిప్ డ్రైవ్‌ను చేపడుతోంది. స్థానికంగా బలంగా ఉంటే పార్టీ నిర్మాణం సులువవుతుందని భావించి సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలను జాతీయ నాయకత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. అనుకున్న స్థాయిలో శ్రేణులు చేపడుతున్నాయా? లేదా? అనే అంశాన్ని పర్యవేక్షించేందుకు ఇన్‌చార్జిగా అభయ్ పాటిల్‌ను నియమించింది. దీనికంటే ముందే సభ్యత్వ నమోదు ఎలా చేపట్టాలి? ఎంతమంది చేపట్టాలనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలకు పార్టీ దిశానిర్దేశం చేసింది. అయినా అనుకున్నంత స్థాయిలో సభ్యత్వ నమోదు జరగలేదని సమాచారం. ఈ తరుణంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తెలంగాణ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించకపోవడంతో దానిపై ఆయన చర్చించనున్నారా? లేక నేతల మధ్య సమన్వయం కోసం వస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.
సభ్యత్వ టార్గెట్ రీచ్ కాలే!
తెలంగాణలో పార్టీ బలోపేతం అవ్వాలంటే అందుకు గ్రామీణ స్థాయి నుంచి బిల్డ్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ నెల 8 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ ప్రక్రియను ఈ నెల 2 నుంచి చేపట్టాలని భావించినా భారీ వర్షాల నేపథ్యంలో పార్టీ ఆలస్యంగా ప్రారంభించింది. ఈ నెల 25వ తేదీ వరకు తెలంగాణలో 50 లక్షల సాధారణ సభ్యత్వాల టార్గెట్‌ను రీచ్ అవ్వాలని భావించినా 8 లక్షల సభ్యత్వాలే జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సభ్యత్వాల ప్రాసెస్‌ను అలాగే కొనసాగించాలనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్టు సమాచారం. పార్టీ తొలుత నిర్ణయించుకున్నట్టుగా ఈ నెల 25 వరకు సాధారణ సభ్యత్వాల ప్రక్రియను క్లోజ్ చేసి అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు క్రియాశీల సభ్యత్వాలను చేపట్టాలని ప్లాన్ చేసుకుంది. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరడంలో భారీ వ్యత్యాసం ఉండటంతో జాతీయ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
జేపీ నడ్డా ఏయే అంశాలపై చర్చిస్తారనే ఆసక్తి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన సభ్యత్వాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయలేకపోతున్నారు. పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండటం వల్ల నాయకులు, కార్యకర్తలు అనుకున్న స్థాయిలో సభ్యత్వాలు చేయలేదని చెబుతున్నారు. పార్టీలో ముఖ్య నేతలు పలువురు సభ్యత్వ నమోదును పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. చొరవ తీసుకోకపోవడం వల్ల అనుకున్న లక్ష్యానికి చేరుకోలేదని సమాచారం. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు కారణంగా పార్టీ నష్టపోయే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణకు వస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. మరి ఆయన తెలంగాణ పర్యటనలో ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పర్యటనలో ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కంటెస్డెడ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో సైతం సమావేశమవుతున్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు చర్చలోకి వస్తాయన్నది శ్రేణుల్లో ఆసక్తి పెంచుతోంది.
జేపీ నడ్డా షెడ్యూల్ ఇదే..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తెలంగాణకు వస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మహంకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు. 6 గంటలకు హోటల్ హరిత ప్లాజాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జేపీ నడ్డా సమావేశమవుతారు. ఈ మీటింగులో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ మీటింగ్ అనంతరం రాత్రి 8 గంటలకు ఖైరతాబాద్ బడా గణేశ్ ఆలయం సమీపంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి నడ్డా హాజరవుతారు. నడ్డా పర్యటన పార్టీలో నేతల మధ్య కొరవడిన సమన్వయం, వర్గపోరును గాడిలో పెట్టేందుకా? లేక సభ్యత్వ నమోదుకా? అన్నది చూడాలి.