బీఆర్ఎస్పై ఉద్యమ కార్యాచరణ.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ

by Javid Pasha |
బీఆర్ఎస్పై ఉద్యమ కార్యాచరణ.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రక్షాళన అనంతరం డీలా పడిన కాషాయ పార్టీ యాక్టివిటీని పెంచాలని ప్లాన్ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పై ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని చూస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సిన అంశాలపై మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లి బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులతో సుదీర్ఘ చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బీఆర్ఎస్ సర్కార్ కు డ్యామేజ్ చేయాలంటే స్థానిక సమస్యలను ప్రధాన అస్త్రంగా పెట్టుకున్న బీజేపీ మరిన్ని అస్త్రాలను సైతం సిద్ధం చేసుకోవాలని చూస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. కాగా పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పుల అనంతరం ఈ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. గతంలో కొనసాగిన టెంపోను మళ్లీ స్టార్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూస్తోంది.

దీనిపై నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించే జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జీల సమావేశంతో క్లారిటీ రానుంది. మంగళవారం నిర్వహించే సమావేశంలో ఎజెండా, కార్యాచరణను బీజేపీ ప్రకటించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన రీజినల్ కన్సల్టేటివ్ మీటింగ్ లో వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను కాషాయ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. కాగా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఆపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే గతంలో పెండింగ్ లో ఉన్న యాక్టివిటీని సైతం పూర్తి చేయాలని నిర్ణయించారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించాలనుకున్న బీజేపీ పలు చోట్లు పూర్తిచేసింది. కానీ ఇంకొన్ని స్థానాల్లో నిర్వహించలేకపోయింది.

అలాగే ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేయాలని భావిస్తోంది. అలాగే ప్రముఖులను కలవడంపై స్పీడ్ పెంచాలని డిసైడ్ అయింది. ఇతర పెండింగ్ పనులను సైతం ఫిక్స్ చేసి సక్సెస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పనులన్నీ ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేయాలని కటాఫ్ తేదీగా పెట్టుకుంది. తెలంగాణలో 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ డ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం పై ప్రత్యేక చర్చ జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో బహిరంగ సభలు కొనసాగించాలని నేతలు సూచించినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ కు రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ ప్రకాశ్ జవదేకర్, ఎంపీ లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ సునీల్ బన్సల్ తదితరులు హాజరయ్యారు.

మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జీలు పాల్గొననున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టబోయే కార్యక్రమాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలపై కార్యాచరణను రూపొందించుకోనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చ సాగనుంది.

Advertisement

Next Story

Most Viewed