మానవత్వం చాటుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్

by GSrikanth |
మానవత్వం చాటుకున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదల పార్టీ బీజేపీ అయితే బీఆర్ఎస్ పెద్దల పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలనపై విసిగిపోయారని, వారంతా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం ఆహిర్‌తో పాటు బండి సంజయ్ ఓబీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. తొలుత రాష్ట్రానికి వచ్చిన హన్సరాజ్ గంగారాంకు బండి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. కష్టపడే కార్యకర్తలను జాతీయ నాయకత్వం గుర్తిస్తుందనడానికి హన్సరాజ్ గంగారాం నిదర్శనమని కొనియాడారు.

రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ప్రతి ఒక్కరూ బీజేపీవైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పేదలు, బలహీనవర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో బీఆర్ఎస్‌కు చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి అంశం నిదర్శనంగా చెప్పొచ్చన్నారు. పేదల బలిదానంతో తెలంగాణ వస్తే.. పెద్దలు రాజ్యమేలుతున్నారని విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం మొదలైందని, సీఎం కేసీఆర్ మళ్లీ కుల సంఘాలను పిలిచి వారికి డబ్బులు పంచుతారని, మోసపూరిత హామీలతో మరోసారి మోసపోవద్దని వెల్లడించారు. గతంలోనూ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల పేరుతో వందల కోట్ల రూపాయలు ఇస్తానని మోసం చేశాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వీధి సభలపై జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలతో బండి సంజయ్ రివ్యూ నిర్వహించారు. బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు సహా స్థానిక కార్యకర్తలు లీడర్లుగా ఎదగడానికి ఈ మీటింగ్‌లు ఉపయోగపడుతున్నాయనే అభిప్రాయాన్ని వీధి సభల నిర్వహణ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సభలకు అనూహ్య స్పందన వస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విజయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లేడంలో సఫలమవుతున్నట్లు వెల్లడించారు. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 8 వేలకు పైగా వీధి సభలు నిర్వహించినట్లు నిర్వహణ కమిటీ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ ఇచ్చిన టార్గెట్ లో 80 శాతం మేరకు మీటింగ్‌లు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ మీటింగ్ లో స్థానిక సమస్యలే ఎక్కువ చర్చకు వస్తున్నాయని బండికి వివరించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మీటింగ్‌ల ద్వారా పార్టీ తొలిదశ క్షేత్రస్థాయి ప్రచారం పూర్తి చేసుకున్నట్లయిందన్నారు. ఈ మీటింగ్‌లకు వస్తున్న స్పందనతో బీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. అందుకే చాలాచోట్ల సభలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శలు చేశారు. ఈనెల 28 వరకు గడువు ఉన్న నేపథ్యంలో పార్టీ నిర్దేశించిన 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.

త్వరలో బీసీ కులాలకు జాతీయ ఓబీసీ జాబితాలో చోటు : హన్సరాజ్ గంగారాం

రాష్ట్రంలో చాలా రోజులుగా డిమాండ్‌‌లో ఉన్న లింగాయత్‌తో పాటు మరికొన్ని కులాలను త్వరలోనే జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం ఆహిర్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో తమతోపాటు సహా పలు బీసీ సామాజికవర్గాలు ఓబీసీ కమిషన్ చైర్మన్‌ను కలిసి తమను జాతీయ ఓబీసీ జాబితాలో లేకపోవడంవల్ల విద్య, ఉద్యోగాల పరంగా నష్టపోతున్నామని పేర్కొంటూ వినతి పత్రం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము పూర్తిగా జాతీయ ఓబీసీ జాబితాలో చేరేందుకు అర్హులమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన హన్స్‌రాజ్ తప్పకుండా లింగాయత్‌తో సహా ఆయా కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.

మానవత్వం చాటుకున్న బండి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మ్యారియట్ హోటల్‌లో మీటింగ్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ట్యాంక్ బండ్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న దంపతులను ఇద్దరు యువకులు వేగంగా బైక్ పై వచ్చి ఢీ కొట్టడంతో భార్యాభర్తలిద్దరూ కిందపడ్డారు. ఇది గమనించిన బండి సంజయ్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి బాధితులను పరామర్శించారు. గాయపడిన దంపతులను ఆసుపత్రికి పంపి చికిత్స చేయించాలని చెప్పడంతో హుటాహుటిన పార్టీ నేతలు తమ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed