BJP: బీజేపీ పక్షోత్సవం..! రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి

by Geesa Chandu |   ( Updated:2024-09-18 16:42:18.0  )
BJP: బీజేపీ పక్షోత్సవం..! రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాని మోడీ పుట్టినరోజు నంచి మొదలుకుని అక్టోబర్ 2 గాంధీజయంతి వరకు పలు కార్యక్రమాలను బీజేపీ చేపట్టనుంది. బీజేపీ పక్షోత్సవం పేరిట ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 17 నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, గురువారం సైతం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేపడుతామన్నారు. ఈనెల 23వ తేదీన జన ఆరోగ్య యోజన కార్డుల జారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వృద్ధులందరికీ ఆరోగ్య బీమా, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి 24 వరకు, అక్టోబర్ 2న అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టంచేశారు. సెప్టెంబరు 18 నుంచి 25 వరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు గంగడి మనోహర్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 2 వరకు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రధాని మోడీ సేవా భావన గురించి మేధావులతో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈనెల 25 నుంచి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో స్కూల్, కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. అలాగే ఈనెల 25న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా అన్ని పోలింగ్ బూత్‌లో కనీసం 100 మందితో సభ్యత్వ నమోదు చేయించాలని సూచించారు. అక్టోబర్ 2న హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో మహాత్మాగాంధీ, ఎల్బీ శాస్త్రి విగ్రహాలను శుభ్రపరిచి అలంకరించడం, ఖాదీ దుస్తులను కొనడం వంటివి చేపడుతామన్నారు. అదే రోజు పారా ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి పతకాలు సాధించిన వారికి సన్మానం చేయనున్నట్లు గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story