Assembly : బీజేపీ ‘అసెంబ్లీ’ ఎజెండా ఫిక్స్.. కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టేలా ప్లాన్

by Rajesh |   ( Updated:2024-07-23 02:39:30.0  )
Assembly : బీజేపీ ‘అసెంబ్లీ’ ఎజెండా ఫిక్స్.. కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టేలా ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నది. రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగుల డిమాండ్లపై మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయనున్నారు.

రుణమాఫీ నిబంధనలపై..

ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి.. ఇప్పుడు నిబంధనలు పెట్టడంపై హస్తం పార్టీని నిలదీయాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఫిక్సయ్యారు. అంతేకాకుండా తమ నియోజకవర్గాలకు జరుగుతున్న అన్యాయంపైనా ప్రశ్నించాలని డిసైడయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సైతం ఆహ్వానం అందడంలేదని గట్టిగా అడగాలని ప్లాన్ చేసుకున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సెగ్మెంట్ల పరిధిలో కలెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తమ అధికారాలను కాలరాస్తున్నారని నిలదీయాలని చూస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిని బీఆర్ఎస్ పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని తమ గళాన్ని వినిపించనున్నారు. ప్రశ్నించిన వారిని అణిచివేయాలని చూడటంపైనా వారు నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.

భేటీ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పై పోరును మరింత ఉధృతం చేయాలని కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఎజెండాను సిద్ధం చేసుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed