కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. టీఆర్ఎస్‌లోకి పల్లె రవి దంపతులు!

by GSrikanth |   ( Updated:2022-10-15 10:03:54.0  )
కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్.. టీఆర్ఎస్‌లోకి పల్లె రవి దంపతులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి గులాబీ పార్టీలో చేరారు పల్లె రవికుమార్ గౌడ్, ఆయన భార్య కల్యాణి. టీఆర్ఎస్ నుంచి గౌడ్ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటే డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా ఆ సామాజికవర్గానికి చెందిన ఓటు బ్యాంకును స్ట్రాంగ్ చేసుకునే ఉద్దేశంతో పల్లె రవిని టీఆర్ఎస్ లాగేసింది. గతంలో ఇదే పార్టీలో ఉన్నప్పటికీ పదవులు రాలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ తరఫున టికెట్ వస్తుందని ఆశించినా అది అడియాశగా మిగిలిపోవడంతో మళ్ళీ టీఆర్ఎస్ వైపుకు వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు.




పల్లె రవి భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడిచిన కాలంలో జర్నలిస్టుగా, తెలంగాణ అభిమానిగా యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో టికెట్ రాకపోవడంతో భంగపడిన పల్లె రవికి భవిష్యత్తులో రాజకీయ అవకాశాలను కల్పించనున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండానే టీఆర్ఎస్‌లో చేరినట్లు పల్లె రవి వ్యాఖ్యానించారు. చండూరును రెవెన్యూ డివిజన్ చేయాలన్న ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. సానుకూల స్పందన రావడంతో ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ జెండాను మోసి పీసీసీ చీఫ్ రేవంత్‌తో కలిసి మునుగోడులో ఎన్నికల ప్రచారం చేసిన పల్లె రవి ఇక గులాబీ పార్టీలో పనిచేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed