BIG News: టార్గెట్.. రీజినల్ రింగ్‌రోడ్..! ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు

by Shiva |
BIG News: టార్గెట్.. రీజినల్ రింగ్‌రోడ్..! ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రీజినల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఆర్థికంగా ఇబ్బందులున్నా పనులు స్పీడ్‌గా సాగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉత్తర భాగం వైపు పనుల మీదే దృష్టి సారించిన సర్కారు.. తాజాగా దక్షిణ భాగం వైపు పనులనూ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం సీఎస్ శాంతికుమారి, రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి పనులపై రివ్యూ నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు, ఆర్‌అండ్‌బీ శాఖ ఆఫీసర్లు.. పనులు వేగవంతమయ్యేలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

పరిహారం చెల్లింపుపై వేగంగా అడుగులు

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుపై ఎన్‌హెచ్‌ఏఐ వేగంగా అడుగులు వేస్తున్నది. అటవీ శాఖ పర్మిషన్ కోసం అధికారులు కేంద్రానికి విన్నవించారు. తొందరలోనే అక్కడి నుంచి ఆమోదం లభించనుందని ఆఫీసర్లు చెబుతున్నారు. పర్మిషన్ రాగానే పర్యావరణ అనుమతులకు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం ఖరారు చేయాలని సమాలోచనలు జరుపుతున్నారు. అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు రాగానే భూ సేకరణకు పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగుమం అవుతుందని అధికారులు చెబుతున్నారు.

యుటిలిటీస్‌ చార్జీల చెల్లింపులో బీఆర్ఎస్ జాప్యం

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ, రైతులకు చెల్లించే పరిహారంలో రాష్ట్ర వాటా జమ, యుటిలిటీస్‌ చార్జీల చెల్లింపు అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాప్యం జరిగింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం అయ్యాయి. ఎన్‌హెచ్‌ఏఐ సైతం పనులను త్వరితగతిన పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు రిజిస్ట్రేషన్‌ విలువలు, మార్కెట్‌లో భూముల విలువల వివరాలు సేకరిస్తున్నారు. గడిచిన మూడేళ్లలో సంబంధిత ప్రాంతంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల ధరలను పరిగణనలోకి తీసుకుని అత్యధిక ధర నిర్ధారించనున్నారు. ఎక్కడి భూమి అయితే సేకరించ తలపెట్టారో.. గ్రామం, మండలం, జిల్లా, అర్బన్‌, రూరల్‌ వారీగా విభజించి, ఏ ప్రాంతంలో ఎంత చెల్లించాలన్న అంశంపై కసరత్తు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ఏరియాల్లో మూడు రెట్లు అధికంగా చెల్లించాలని యోచిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై మరింత స్పష్టత రానున్నది.

Advertisement

Next Story