BIG News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం: సీఎం రేవంత్ ‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-16 15:02:11.0  )
BIG News: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యం: సీఎం రేవంత్ ‌‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవడం తథ్యమని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు తన వ్యాఖ్యలను ఇప్పుడు ఖండించినా.. ఎప్పటికైనా అది జరగక మానదని అన్నారు. విలీనం అయిన వెంటనే కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కొడుకు కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని అన్నారు. ఇక అల్లుడు హరీష్‌రావు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత అవుతారంటూ జోస్యం చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అవ్వగానే అందుకు ప్రతిఫలంగా బెయిల్ వస్తుందని రేవంత్ బాంబు పేల్చారు. 4 రాజ్యసభ సీట్లకు సమంగా కవితకు రాజ్యసభ సీటు కన్ఫామ్ చేస్తారని కామెంట్ చేశారు.

వరంగల్ డిక్లరేషన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసి చూపించామని పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులు ఎవరూ నిరుత్సాహ పడొద్దని, రుణమాఫీకి రూ.5 వేల కోట్ల మేర రిజర్వ్ నిధులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రుణమాఫీ కాని అన్నదాతలు అందరూ కలెక్టరేట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒకే కుటుంబంలో వారికి రూ.2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు. తన మార్క్ పాలన ఉండాలనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించి మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర అర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దాచిన ఖజానాను అంతా కాంట్రాక్టర్లకే కట్టబెట్టాడని ఆరోపించారు. ఢిల్లీ వాళ్లకు రాజ్యసభ ఎలా ఇస్తారని బీఆర్ఎస్ వాళ్ల విమర్శలను తాము పట్టించుకోమని అన్నారు. పీసీసీ చీఫ్ పదవి అంశం తన చేతిలో లేదని, అధిష్టానం నిర్ణయం ప్రకారమే తాము నడుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆ విషయంలో తన అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పానని స్పష్టం చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై తాము ఒక స్టాండ్ తీసుకున్నామని, అదే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టామని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed