BIG News: రూటు మార్చనున్న బీఆర్ఎస్..! ప్రజలతో మమేకమయ్యేలా స్కెచ్

by Shiva |   ( Updated:2024-08-30 01:51:52.0  )
BIG News: రూటు మార్చనున్న బీఆర్ఎస్..! ప్రజలతో మమేకమయ్యేలా స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహ రచన చేస్తున్నది. ఇందు కోసం అంశాల వారీగా పోరాటాలకు సిద్ధమవుతున్నది. ఓ వైపు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే కొన్ని అంశాలపై లీగల్‌గా ఫైట్ చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే రైతురుణమాఫీపై ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలను ప్రజలకు వివరించడంతో పాటు ధర్నాలకూ పిలుపునిచ్చింది. రైతుభరోసా, రైతు బీమా అంశాలపైనా ఫైటింగ్‌కు సిద్ధమవుతున్నది.

వానాకాలం నాట్లు పూర్తయినా రైతుభరోసా ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నది. విద్యా, వైద్యం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజలకు వివరించి వారిని చైతన్యం చేసి తమవైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఇలా పార్టీ ఇచ్చిన ప్రతి నిరసనలోనూ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యం అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీని కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటించనున్నట్టు నేతలు చెబుతున్నారు.

లీగల్ ఫైట్‌కు సన్నద్ధం

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంతో తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయని, 9 కంపెనీల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, ఎన్నికల సమయంలో మద్యం, కార్లు, బంగారం కొనుగోలుకు ఉపయోగించారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధం అవుతున్నది. ఈ స్కాంపై ఈడీ విచారణ చేసేలా ఫిర్యాదు చేయాలని రెడీ అవుతున్నది. దీంతో పాటు సివిల్ సప్లయిలో స్కాం జరిగిందని దానిపైనా ఈడీ, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. హైడ్రా, జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని లీగల్‌గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తున్నది. వీటితో పాటు పార్టీపైనా, కేసీఆర్ పైనా, నేతలపైనా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపైనా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నది.

ఎల్ఆర్ఎస్ అంశాన్ని బలంగా తీసుకెళ్లాలని..

ఎల్ఆర్ఎస్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఎన్నికల టైంలో తాము అధికారంలోకి వస్తే రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే 25.44 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయని, అందరికీ ఫ్రీగా చేయాలని డిమాండ్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసేలా పోరాటాలు చేయాలని నిర్ణయించనున్నట్టు సమాచారం. గతంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిల్‌ను వివరించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తున్నది. జాబ్ నోటిఫికేషన్, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 తదితర అంశాలతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కేడర్‌లోనూ జోష్ నింపేలా బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తున్నది. మరి బీఆర్ఎస్ చేపట్టే పోరాటానికి ప్రజల మద్దతు ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉన్నది.

Advertisement

Next Story