Jamili Elections: ప్రాంతీయ పార్టీలకు బిగ్ షాక్! ‘జమిలి’ని వ్యతిరేకిస్తూ గగ్గోలు

by Shiva |   ( Updated:2024-12-13 01:59:54.0  )
Jamili Elections: ప్రాంతీయ పార్టీలకు బిగ్ షాక్! ‘జమిలి’ని వ్యతిరేకిస్తూ గగ్గోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు శరాఘాతంగా మారుతాయని ఆయా పార్టీలు ఆందోళనలో పడ్డాయి. అందుకే.. చాలా వరకు ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలకే అడ్వాన్‌టేజీ అవుతుందని ప్రాంతీయ పార్టీల నేతలు భావిస్తున్నారు. ఒక్కోసారి ప్రాంతీయ పార్టీల ఉనికి సైతం ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమిలి నిర్ణయాన్ని బీజేపీ, దాని మిత్రపక్షాలు స్వాగతిస్తున్నా.. ఇండియా కూటమిలోని పార్టీలు మాత్రం వ్యతిరేకించే అవకావాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనికి సైతం బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక వచ్చేలోగా ఇండియా కూటమిలోని పలు పార్టీలను ఒప్పించే ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. పరోక్షంగా మరికొన్నింటి సహకారం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

అంతా నంబర్​ గేమ్..

జమిలి ఎన్నికలకు దాదాపుగా 16 రకాలైన రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి. వీటికి ప్రధానంగా లోక్‌సభ, రాజ్యసభల్లో మూడింట రెండోంతుల మెజార్టీ, మెజార్టీ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించడం అవసరం. అయితే.. ఇదంతా కూడా నంబర్​గేమ్‌లో భాగం. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. మరో 6 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉన్నది. వీటిలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇండియా కూటమిలోని పార్టీలు అధికారంలో ఉన్నాయి. జమిలి ఎన్నికలకు అవసరమయ్యే రాజ్యాంగ సవరణల్లో కొన్నింటిని సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది.

దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో సగం రాష్ట్రాలు అసెంబ్లీల్లో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందడం పెద్ద ఇబ్బంది కాదు. ఇండియా కూటమిలో అసంతృప్తిగా ఉన్న పార్టీలను మచ్చిక చేసుకోవడం, వారిలో జమిలికి వ్యతిరేక భావన లేకుండా చేసుకోవాలనే వ్యూహంలో బీజేపీ కీలక నేతలు ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు.. రాజ్యాంగ సవరణకు సాంకేతికంగా సభకు ఎన్నికైన వారిలో మూడింత రెండోంతుల మెజార్టీ కావాలా? లేక బిల్లుపై ఓటింగ్​జరిగే రోజు హాజరైన సభ్యుల్లో మూడింట రెండోంతుల మెజార్టీ సరిపోతుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జమిలి బిల్లు ఆమోదం పొందడానికి పెద్దగా అడ్డంకులు లేవనే విశ్వాసంలో బీజేపీ నేతలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో కాంగ్రెస్

బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. లోక్‌సభలో 99 మంది సభ్యుల బలం ఉన్నది. ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్​కాంగ్రెస్​(టీఎంసీ) కీలకంగా మారనుంది. ఇండియా కూటమి నాయకత్వం పట్ల ఆమె ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి తానే నేతృత్వం వహిస్తాననే ఆలోచనలో ఆమె ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. టీఎంసీకి లోక్‌సభలో 29 మంది, రాజ్యసభలో 13 మంది ఉన్నారు. దీంతో ఉభయసభల్లోనూ టీఎంసీ పార్టీ కీలక పాత్ర పోషించబోతున్నది. డీఎంకే, సమాజ్‌వాది పార్టీలకు పార్లమెంట్​ఉభయ సభల్లో అత్యధిక సభ్యులు ఉన్నారు. వీరిని ఒప్పించడమా? ఆ పార్టీలను చిల్చడమా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. బీజేపీ ఇప్పటివరకు కీలక టాస్క్‌లను టెకప్​చేసిందని.. అన్నింటినీ విజయవంతంగా పూర్తిచేసిందని.. ఈ నేపథ్యంలో జమిలి బిల్లును విజయవంతంగా ఆమోదింపజేస్తుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జమ్మూకశ్మీర్​ఆర్టికల్​370ని తొలగింపును సైతం చాలా కూల్‌గా చేశామని.. జమిలి బిల్లు కూడా అదేవిధంగా ఆమోదింపజేసుకుంటామనే దీమాలో బీజేపీ వర్గాలు ఉన్నాయి.

మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం..

లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యులు ఉన్నారు. మూడింట రెండొంతుల మెజార్టీ కావాలంటే 361 మంది ఎంపీల మద్దతు ఉండాలి. ఇక రాజ్యసభ విషయానికి వస్తే ఎన్డీయేకు 125 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి 88 మంది ఉన్నారు. కూటములకు సంబంధం లేకుండా మరో 24 మంది సభ్యులు ఉన్నారు. ఏ కూటమికి సంబంధంలేని వారిలో వైఎస్ఆర్​సీపీ వారు ఎనిమిది మంది, బీజేడీకి చెందిన వారు ఏడుగురు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు నలుగురు, ఎఐఏడీఎంకే వారు ముగ్గురు ఉన్నారు. రాజ్యసభలో మూడింట రెండోంతుల మెజార్టీ కావాలంటే 163 మంది సభ్యులు అవసరం. అంటే రాజ్యంగ సవరణకు మరో 38 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేడీ ఇప్పటికే జమిలికి మద్దతు కూడా తెలిపింది. వైఎస్ఆర్​సీపీ బీజేపీ పట్ల కొంత సానుకూల వైఖరితోనే ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆ రెండు పార్టీలు కీలకం..

జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలో ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, ఇండియా కూటమిలోని తృణమూల్​కాంగ్రెస్‌లు కీలకంగా మారాయి. ఎన్డీయే కూటమికి టీడీపీ మద్దతు కీలకంగా మారింది. టీడీపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. దీంతో జమిలి ఎన్నికలు తరువాత ముందు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బీజేపీ పడాల్సి ఉంటుంది. ఇప్పటికే జమిలిపై ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నామనే పూర్తి సమాచారాన్ని మోడీ, అమిత్​షాలు చంద్రబాబు నాయుడుకు వివరించినట్లుగా సమాచారం. ఆయన కూడా జమిలికి పూర్తి మద్దతు ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే.. కొన్ని షరతులు పెట్టినట్లుగా చెబుతున్నారు. వాటికి కూడా కేంద్రంలోని బీజేపీ అంగీకరించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఏన్డీయేలోని పార్టీలతో జమిలికి బిల్లుకు ఎలాంటి సమస్యరాదని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed