Ration Card: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. మరో కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్..!

by Satheesh |
Ration Card: రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. మరో కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కోటికిపైగా కుటుంబాలు ఉంటే అందులో 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటుండడంతో అనర్హులూ లబ్ధి పొందుతున్నారని తద్వారా ప్రజాధనం దుర్వినియోగమవుతోందన్న ఆరోపణలున్నాయి. దుబారాను అరికట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టింది. రేషన్ కార్డులు సబ్సిడీ బియ్యాన్ని అందుకోడానికే మాత్రమే ఉపయోగపడాలని, సంక్షేమ పథకాలకు అవి గుర్తింపు కార్డులుగా మాత్రమే ఉండాలి తప్ప అర్హతను నిర్ధారించే కొలమానంగా ఉండొద్దని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రేషన్ కార్డులను వెల్ఫేర్ స్కీంల నుంచి డీ-లింక్ చేయడంపై కసరత్తు మొదలైంది.

దీనిలో భాగంగానే రైతు రుణమాఫీ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికం కాదని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆరోగ్యశ్రీ సేవల కోసం రేషన్ కార్డుకు బదులుగా ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కార్డులనే అందించాలని భావిస్తోంది. రానున్న రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలకూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నది. దీనిపై స్పష్టత రావడానికి వీలుగా ప్రభుత్వం త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని చర్చకు పెట్టి సభ్యులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే నిర్ణయానికొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం అభయహస్తం పేరుతో దరఖాస్తులను ఆహ్వానిస్తే సుమారు 1.10 కోటి దరఖాస్తులు వచ్చాయి. వీటిలో దాదాపు 20 లక్షలు దరఖాస్తులు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చినవేనని తేలింది. ఇందులో అర్హమైనవి గుర్తించి జారీ చేస్తే ఇప్పటికే వినియోగంలో ఉన్న 90 లక్షలతో కలిపితే కనీస స్థాయిలో కోటి దాటనున్నది. ఇందులో చౌక ధరల దుకాణాల ద్వారా రెగ్యులర్‌గా బియ్యం తీసుకుంటున్న కుటుంబాలను గుర్తించి వాడకుండా ఉన్న కార్డులను తొలగిస్తే ఎన్ని ఫిల్టర్ అవుతాయనేది స్పష్టత వస్తుంది. ఇప్పటికే అన్ని రేషన్ కార్డులకు ఈ-కేవైసీ ప్రాసెస్ దాదాపు 70% కంప్లీట్ అయినట్లు తేలింది.

అన్ని పథకాలకూ రేషను కార్డును కొలమానంగా తీసుకునే విధానానికి స్వస్తి చెప్పి కేవలం సబ్సిడీ బియ్యానికి మాత్రమే ఆ కార్డును పరిమితం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. మిగిలిన వెల్ఫేర్ స్కీమ్‌లకు ప్రభుత్వం ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందించాలన్నది కేబినెట్ సబ్ కమిటీ ఖరారు చేయాల్సి ఉంది. ఈ కమిటీ విధివిధానాలపై స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత మరింత క్లారిటీ రానున్నది. ఎలాగూ రుణమాఫీకి, ఆరోగ్యశ్రీ పథకాలకు రేషన్ కార్డును డీ-లింక్ చేసినందువల్ల రానున్న రోజుల్లో మరిన్ని పథకాలకు కూడా ఇదే విధానం కొనసాగే అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది.

Advertisement

Next Story