Bhatti Vikramarka: మా నిధులు ఏపీ ఖాతాల్లో వేశారు.. కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి

by Prasad Jukanti |
Bhatti Vikramarka: మా నిధులు ఏపీ ఖాతాల్లో వేశారు.. కేంద్ర ఆర్థిక మంత్రికి భట్టి విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను నిర్మలా సీతారామన్ కు వివరించామన్నారు. 2024-15 లో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు ఏపీ ఖాతాలోనే వేశారని అందులోని తెలంగాణ వాటా నిధులు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరారమన్నారు. 2019-20 నుంచి ఇప్పటి వరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నిధులు రాష్ట్రానికి అందలేదని వాటిని కూడా విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. మొత్తం తెలంగాణ ప్రభుత్వం 8 అంశాలపై కేంద్ర మంత్రిని కోరగా వాటిపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. వీటి పరిష్కారం కోసం త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారన్నారు.

తెక్కలు తీస్తున్నాం.. తాట తీస్తాం:

హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. చెరువులు ఆక్రమణలకు గురికాకూడదనే హైడ్రా ఏర్పాటు చేశామని హైడ్రా ఏర్పాటును ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చాకే చర్యలు తీసుకుంటున్నామని, 2014 నుంచి 2023 మధ్య చెరువులు భారీగా ఆక్రమణకు గురయ్యాయన్నారు. ఈ ఆక్రమణల వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు, వ్యవస్థలు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆక్రమించిన వారితో పాటు వారికి సహకరించిన వారిని వదిలేది లేదన్నారు. ఇప్పటికే శాటిలైట్ ఫోటోలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామని సంవత్సరాల వారీగా డేటా మొత్తాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. 2014కు ముందు నగరంలో చెరువులు ఎలా ఉన్నాయి? ఆ తర్వాత ఎంత ఆక్రమణకు గురయ్యాయో వివరిస్తామన్నారు. ఇందులో అధికార పార్టీనా, ప్రతిపక్ష పార్టీనా అనే అంశం కాకుండా ప్రజలకు చెందిన నగరాన్ని, చెరువులను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అన్నారు.

Advertisement

Next Story