Anjaneya Goud: రాహుల్ గాంధీ ఎవరు?.. ఆయనకేం సంబంధం

by Gantepaka Srikanth |
Anjaneya Goud: రాహుల్ గాంధీ ఎవరు?.. ఆయనకేం సంబంధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే వెనక రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తున్నాయే కానీ బీసీలకు ఒరిగే లాభాలేవీ ఉండేలా లేవని రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) మాజీ సభ్యుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్(Anjaneya Goud) అన్నారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వే అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ద్వారానో లేదా బీసీ కమిషన్(BC Commission) చట్టాన్ని సవరించి, పూర్తి అధికారాలిచ్చి, కమిషన్‌కు న్యాయబద్ధత కల్పించడం ద్వారానో శాస్త్రీయ సర్వేకు మార్గం చూపకుండా, ప్రభుత్వమే గందరగోళం సృష్టిస్తుందోన్నారు. కర్ణాటకలో లా బీసీ కమిషన్‌కు అధికారాలు కల్పిస్తే, నోడల్ ఏజన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్‌ను నియమించుకొని కమిషన్ న్యాయబద్ధమైన గణించదగిన డేటాను సేకరిస్తుందన్నారు. కానీ 199, 47, 18 జీవోల మధ్య స్పష్టత లేకపోవడం వల్ల సర్కార్ చేపడుతున్న సర్వే దేనికోసమో అర్థం కావడంలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేను కావాలనే న్యాయపర సమస్యల్లోకి నెట్టేలా నిర్వహిస్తోందన్నారు. ఒంటిపూట బడుల తర్వాత, ప్రాథమికోపాధ్యాయులు ఇండ్లలో ఎవరూ ఉండని మధ్యాహ్నం వేలల్లో, ఏ సమాచారం సేకరిస్తారని ప్రశ్నించారు. పైగా ఏ ఒత్తిడి లేకుండా నిస్పక్షపాతంగా, వాస్తవ సమాచార సేకరణ చేయల్సిన సర్వే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ జోక్యం దేనికోసమని విమర్శించారు. అసలు ఇంటింటి సర్వేను చేపడుతున్నది రాష్ట్ర ప్రభుత్వమా లేదా కాంగ్రెస్ పార్టీనా?, సర్కార్ కసరత్తును కాంగ్రెస్ సర్కస్‌గా నిర్వహించాలనుకోవడం దారుణమన్నారు. హస్తం పార్టీ నేతల జోక్యం వల్ల గ్రామాల్లో సర్వే ప్రభావితమై, సామాజిక వర్గాల లెక్కలు తలకిందులయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన కోసం ఈనెల5న వివిధ వర్గాలతో సమావేశం కావడానికి రాహుల్ గాంధీ ఎవరని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకున్న బాధ్యతలేంటని ప్రశ్నించారు. ఇదే పద్ధతిలో ప్రభుత్వం కులాలు, కుటుంబాల వివరాలు సేకరిస్తే, బీసీలకు తీరని ద్రోహం జరగడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కులగణను కుట్రగణనగా మార్చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు తీర్పులను, విపక్షాల సూచనలను పరిగణలోకి తీసుకొని సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed