TGSRTC : బతుకమ్మ, దసరా స్పెషల్.. ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్

by Ramesh N |
TGSRTC : బతుకమ్మ, దసరా స్పెషల్..  ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీస్‌లను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్ధం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది. దసరా పండుగ ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సోమవారం ఎండీ వీసీ సజ్జనార్ వర్చువల్‌గా సమావేశమయ్యారు.

గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే చాన్స్ ఉందని, గతంలో మాదిరిగానే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని సజ్జనార్ ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఎండీ తెలిపారు. ఈ పండుగకు 5304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.

అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున 9,10,11 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే చాన్స్ ఉందన్నారు. ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టంలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కరీంగనర్, నిజామాబాద్ మార్గాల్లో కాలుష్యరహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించకుకోవాలన్నారు. రద్దీకి తగినట్లు బతుకమ్మ దసరా పండుగలకు 6 వేల స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్‌లో సంప్రదించాలని సూచంచారు. స్పెషల్ సర్వీసులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed