BRS మళ్లీ అధికారంలోకి వస్తే స్విగ్గీ, జొమాటో ద్వారా మద్యం డెలివరీ: బండి సంజయ్

by Satheesh |
BRS మళ్లీ అధికారంలోకి వస్తే స్విగ్గీ, జొమాటో ద్వారా మద్యం డెలివరీ: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోందని, ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోందని, యావత్ తెలంగాణ మరో 5 నెలలు ఆగాలని, ప్రజలే కేసీఆర్ సర్కార్‌ను నిషేధించడంతో పాటు గద్దె దించబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో ‘‘ఖేలో భారత్- జీతో భాగ్యనగర్’’ పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్‌ను తిలకించడానికి వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.

చివరకు బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇచ్చే దుస్థితికి కేసీఆర్ చేరుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. తన పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూపీఏ హయాంతో పోలిస్తే క్రీడల బడ్జెట్‌ను 8 రెట్లు అధికంగా కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని బండి తెలిపారు. గతంలో క్రీడల్లో సెలెక్ట్ కావాలన్నా, అవార్డులు ఇవ్వాలన్నా పైరవీలు ఉండేవని ఆరోపించారు. తెలంగాణలో 'తాగుడు-ఊగుడు’ పథకంతో ‘‘పీలో తెలంగాణ- పిలావో తెలంగాణ’’ నినాదంతో కేసీఆర్ గల్లీగల్లీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఫైరయ్యారు. బంపర్ ఆఫర్ పేరుతో మందు రేట్లు తగ్గించి తాగుడును మరింత ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

ఇక్కడి ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పంజాబ్ రైతులకు పైసలిస్తున్నాడని, మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి లక్షల జీతం ఇచ్చి చేర్చుకున్నారని ధ్వజమెత్తారు. హైకోర్టు తిడితే ఏపీకి పారిపోయినోడిని పట్టుకుని వచ్చి మళ్లీ ఇక్కడ చీఫ్ అడ్వయిజర్ పోస్టులివ్వడంపై బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు మరింత ఇబ్బందుల్లో పడతారని, స్విగ్గి, జొమాటో ద్వారా ఇంటింటికీ మద్యాన్ని పంపిణీ చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీడియాకు వందల కోట్ల యాడ్స్‌తో పాటు ప్యాకేజీలు ఇచ్చి బీజేపీకి సంబంధించిన వార్తలు రావొద్దని అదేశిస్తున్నాడని విమర్శలు చేశారు. కేసీఆర్ నిజంగా అభివృద్ధి చేసి ఉంటే శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని బండి డిమాండ్ చేశారు.

కర్నాటక ఎన్నికల ఫలితాలతో.. తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఆయన చెప్పారు. ఒక సెక్షన్ మీడియా ఆంధ్రప్రదేశ్‌లో మద్దతిస్తున్న పార్టీ నాయకుడికి సపోర్ట్ చేస్తోందని, మరో సెక్షన్ మీడియా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్లు చీల్చి బీఆర్ఎస్‌ను గెలిపించాలని చూస్తోందని బండి మండిపడ్డారు. ఇక ఈటల రాజేందర్ తమ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిస్తే తప్పేముందని అన్నారు. కేసీఆర్ ఆ పార్టీ నాయకులను కలవరు కాబట్టి బీఆర్ఎస్ నేతలకు కొత్తగా అన్పిస్తుండవచ్చని చురకలంటించారు. తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయని, అదంతా మీడియా సృష్టేనని బండి తెలిపారు. తనను హైకమాండ్ పిలవనేలేదని సంజయ్ క్లారిటీ ఇచ్చారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకమాండ్‌కు అప్పీల్ చేశామని, త్వరలోనే హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story