‘ఆయన ఓ అజ్ఞాని’.. ఒవైసీకి బండి సంజయ్ షాకింగ్ కౌంటర్

by karthikeya |   ( Updated:2024-11-02 16:45:16.0  )
‘ఆయన ఓ అజ్ఞాని’.. ఒవైసీకి బండి సంజయ్ షాకింగ్ కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న నరేంద్ర మోడీ సర్కార్.. వక్ఫ్ బోర్డ్‌లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేంటని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ అసలు రంగు ఈరోజు పూర్తిగా బయటపడిందని శనివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి, వక్ఫ్ బోర్డు భూములకు లింకు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఓవైసీ.. కలియుగ దైవానికి, వక్ఫ్ భూములకు తేడా తెలియని అజ్ఞాని అంటూ ఘాటు విమర్శలు చేశారు.

వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని ఆయన తెలిపారు. వక్ఫ్ అనేది ప్రార్ధించే మక్కా మసీదు కూడా కాదని, అయినా ఓవైసీ.. సిగ్గులేకుండా టీటీడీకి, వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న భూముల దందాకు లింకు పెడతవా? అంటూ మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు మాత్రమే దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు. టీటీడీ తనకు వచ్చిన విరాళాలతో పేదలకు, హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తోందే తప్ప.. ఏనాడూ ప్రజల ఆస్తులను కబ్జా చేసుకోలేదని చెప్పారు.

ఒవైసీ దృష్టిలో భగవంతుడంటే వ్యాపారమేనని, అల్లా పేరు చెప్పుకుని భూములను దోచుకున్నాడని ఆరోపణలు చేశారు. ఓవైసీ.. వేల ఎకరాలను కబ్జా చేశాడని, కాలేజీలు, ఆసుపత్రులు కట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడన్నారు. చివరికి చెరువులను, శిఖం భూములను కూడా కబ్జా చేసి భవంతులు కట్టుకున్నాడని బండి ఆరోపణలు చేశారు. అట్లాంటి మతోన్మాది దేవుడిని వ్యాపార వస్తువుగా, అవకాశవాద అంశంగా మార్చుకోకుండా మాట్లాడగలడా.. అని ఎద్దేవా చేశారు. పాతబస్తీ వాసులు ఒవైసీ మాటలు నమ్మి దశాబ్దాలుగా మోసపోతున్నారని, వారి ఆలోచన మారాలని, వాస్తవాలు గ్రహించాలని కోరారు. దశాబ్దాల తరబడి ఓట్లేసి ఎంఐఎంను గెలిపిస్తున్నా.. ఓల్డ్ సిటీ ఇంకా ఎందుకు ఓల్డ్ సిటీగానే మిగిలిపోయిందో ఆలోచన చేయాలన్నారు. అక్కడి ప్రజలు ఇంకా పాన్ షాపులు నడుపుకుంటూ, పంక్చర్లు వేసుకుంటూ, తినడానికి తిండిలేక సరైన ఇల్లు లేక ఎందుకు అల్లాడుతున్నారని బండి ఆవేదన వ్యక్తంచేశారు.

బీఆర్ఎస్ జాతకాలు తమ వద్ద ఉన్నాయని, అవి చెబితే వాళ్లు తట్టుకోలేరని, ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటపెట్టాలా? అని అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన కుటుంబ పార్టీతో పదేళ్లు అంటకాగిన నిఖార్సయిన దేశద్రోహ పార్టీ ఎంఐఎం అని బండి విమర్శలు చేశారు. ఎంఐఎం తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని, వారి అవసరం కోసం బీఆర్ఎస్ ను వాడుకుని ఇప్పుడు దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రాజ్యమేలుతున్న నకిలీ గాంధీ వారసుల పార్టీ(కాంగ్రెస్)ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతోందని బండి చురకలంటించారు. ఒవైసీ సోదరుల శీల పరీక్ష గడువు ముగిసినట్లుందని ఎద్దేవాచేశారు. కల్వకుంట్ల కుటుంబం ఇకనైనా సిగ్గుతో తలదించుకోవాలరని, రాజకీయ మతోన్మాదంతో రగిలిపోతూ జన్మనిచ్చిన తల్లికే వెన్నుపోటు పోడుస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న ఎంఐఎంతో అంటకాగినందుకు ముక్కు నేలకురాసి యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బండి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed