అసైన్డ్ భూములకు అమ్ముకునే హక్కు కల్పించాలి: కరుణాకర్ దేశాయ్

by Satheesh |   ( Updated:2024-01-16 14:59:09.0  )
అసైన్డ్ భూములకు అమ్ముకునే హక్కు కల్పించాలి: కరుణాకర్ దేశాయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అసైన్డ్ భూములకు సంపూర్ణ హక్కులు కావాలని, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమ్ముకునే అవకాశం కల్పించారని తెలంగాణ సోషల్ మీడియా, తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ అన్నారు. పట్టా ఇచ్చిన 20 ఏండ్ల తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకునే హక్కును కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చట్ట సవరణ చేశారన్నారు. అందుకే ఈ అంశంపై లోతైన చర్చ జరపాలని బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉంటుందని, పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ చట్టాల నిపుణులు, పలు ప్రజా సంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి, లక్ష ఎకరాల పైచిలుకు భూదాన భూమిని పేదలకు పంచారు. ప్రభుత్వ భూములపై పేదలకు ఇచ్చిన పట్టాలనే అసైన్డ్, డిఫార్మ్, లావోని, డికెటీ పట్టాలుగా విభజించారు. దేశం మొత్తంలో పంచిన ప్రభుత్వ భూమిలో ఇది 28 శాతం. భూకమతాలపై పరిమితులు విధించి, నిర్దేశిత పరిమితి కన్నా ఎక్కువ భూమి ఉన్నవారి దగ్గరినుండి భూమి తీసుకుని పేదలకు పంచారు. ఆలా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఆరు లక్షల ఎకరాల సీలింగ్ మిగులు భూములను పంచారు. పేదలకు పంచిన (అసైన్డ్) భూములను ఎవరూ ప్రలోభాలకు గురిచేసి తీసుకోకుండా, దౌర్జన్యంగా లాక్కోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయన్నారు.

అసైన్డ్ భూములను తరతరాలుగా అనుభవించాల్సిందే కానీ ఇతరులకు ఏవిధంగానైనా బదలాయించకూడదనేది చట్ట నియమం. పకడ్బందీ చట్టం ఉన్నా ఒక పక్క వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయి. మరోపక్క అవసరానికి అసైన్డ్ భూములను అమ్ముకునే వెసులుబాటు లేకపోవడం వల్ల అవస్థలు పడుతున్నారన్నారు. భూమిని సాగు చేసుకోవడంతోపాటు అవసరానికి అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలనే వాదన ఎంతో కాలంగా ఉంది. భూమిపై హక్కు అంటే అనుభవించడం మాత్రమే కాదు. పట్టా భూములపై ఉండే హక్కులన్నీ ప్రభుత్వం ఇచ్చిన భూములపైన కూడా ఉండాలన్న డిమాండ్ ఉన్నదన్నారు. అసైన్డ్ భూములపై నిషేధం ఉన్న అమ్మకాలు ఆగడంలేదు. పైగా అమ్ముకునే అవకాశం లేకపోవడం వల్ల పేదల నుంచి తక్కువ ధరకే భూములు కొంటున్నారు. ఈ అంశంపై చర్చా కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనొచ్చునన్నారు.

Read More..

వచ్చే ఏడాది నుంచి ప్రతి మండలంలో.. రాష్ట్రమంతా పండగ వాతావరణం

Advertisement

Next Story