కేబినెట్ విషయాలు వాళ్లు బీఆర్ఎస్‌కు చేరవేస్తున్నారా..?

by karthikeya |
కేబినెట్ విషయాలు వాళ్లు బీఆర్ఎస్‌కు చేరవేస్తున్నారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోన్న కొందరు బ్యూరోక్రాట్స్ మాత్రం ఇంకా గులాబీ పార్టీతో టచ్‌లో ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ శాఖ పరిధిలో తీసుకుంటోన్న నిర్ణయాలను సదరు లీడర్లకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు అనుమానాలున్నాయి. అలాగే కేబినెట్ విషయాలు, మంత్రుల కామెంట్స్, కాంగ్రెస్ లీడర్ల నుంచి వచ్చే ఫోన్‌లో ఆదేశించే వివరాలను సైతం పూసగుచ్చినట్టు చెప్తున్నారనే ప్రచారం ఉంది. ఈ మధ్య మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ‘ప్రతి శాఖలో జరుగుతోన్న విషయాలు తమకు తెలుస్తాయి’ అని చెప్పడం వెనక అధికారులు ఇన్పర్మేషన్ లీక్ చేస్తున్నారనే చర్చ సెక్రెటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.

హెచ్చరికలు పట్టించుకోవట్లే!

అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇన్పర్మేషన్ లీక్ అవుతోన్న విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం సదరు శాఖల ఆఫీసర్లను పిలిచి తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనితో కొంత కాలం బీఆర్ఎస్ లీడర్లకు దూరంగా ఉన్న సదరు ఆఫీసర్లు మళ్లీ వారికి సమాచారాన్ని చేరవేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో జరిగే విషయాలు తమకు తెలుస్తాయని, తమకు కూడా సమాచారం ఇచ్చే వారు ఉంటారని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటీ?అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. ఇప్పటికీ కొందరు ఆఫీసర్లు గులాబీ లీడర్లతో టచ్‌లో ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానానికి బలం చేకూరే విధంగా ఈ మధ్య కొన్ని పరిణామాలు జరిగాయని చర్చించుకుంటున్నారు. వివిధ పనుల కోసం కొన్ని శాఖల అధికారులకు కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ విషయాలు రెండు మూడు రోజుల తర్వాత కొందరు కీలక గులాబీ లీడర్లు తమ సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. అలాగే ఈ మధ్య కేబినెట్‌లో జరిగిన విషయాలు కూడా సదరు లీడర్‌కు పూసగుచ్చినట్టు తెలిసిందనే ప్రచారం జరుగుతున్నది. దీనితో లీక్ ఆఫీసర్లను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్లలో ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ హాయంలో కీలక శాఖల్లో పనిచేసిన ఆఫీసర్లే ఇన్పర్మేషన్ లీక్ చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed