సీఎంఆర్ఎఫ్‌లో నకి’లీల’లు.. ఈ గోల్‌మాల్‌లో ఎవరి వాటా ఎంత?

by Hamsa |
సీఎంఆర్ఎఫ్‌లో నకి’లీల’లు.. ఈ గోల్‌మాల్‌లో ఎవరి వాటా ఎంత?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రిలీఫ్ ఫండ్ లో నకిలీ దరఖాస్తులు బెడద ఎక్కువైంది. తప్పుడు రిపోర్టులు సమర్పించి లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. ఈ ఎఫిసోడ్ లో రాజకీయ లీడర్ల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయి. గత మూడు నాలుగేళ్లుగా ఈ దందా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అనుమానం ఉన్న దరఖాస్తుల విషయంలో క్రాస్ చెక్ చేసినప్పుడే మాత్రమే కొన్ని బయటికి వస్తున్నాయి. లేకపోతే తప్పుడు బిల్లులకు కూడా డబ్బులు చెల్లిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రజాప్రతినిధుల దగ్గరే నకిలీలకు చాన్స్

ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న నిరుపేదలకు ప్రభుత్వం సీఎం రిలీప్ ఫండ్ కింద ఆర్థిక సాయం చేస్తోంది. అయితే పేషంట్ నేరుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకనే అవకాశం లేదు. అప్లికేషన్లను స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ,ఎమ్మెల్సీలకు ఇస్తే, వారు తమ సిపారసు లేఖలను అటాచ్ చేసి, సీఎంఆర్ఎఫ్ విభాగానికి పంపుతున్నారు. వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని సరిగ్గా ఉన్నాయని భావించినప్పుడే మాత్రం రోగి పేరుతో చెక్ తయారు చేస్తారు. ఆ చెక్ ను నేరుగా రోగి ఇంటికి పంపకుండా సిపారసు చేసిన ప్రజాప్రతినిధికి పంపుతారు. అప్లికేషన్ ఇచ్చిన మొదలుకుని చెక్ వచ్చే వరకు ఎమ్మెల్యేలు,ఎంపీ,ఎమ్మెల్సీలు కీలకంగా మారుతున్నారు. దీంతో కొందరు ప్రజాప్రతినిధుల పీఏలు,పీఎస్ లు, బ్రోకర్లతో చేతులు కలిపి నకిలీ అప్లికేషన్లను ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముందే కుదర్చుకున్న ఒప్పందం మేరకు రోగి, అసుపత్రి, బ్రోకర్ మధ్య వాటాలు జరుగుతున్నట్టు సమాచారం.

రాని రోగానికి ట్రీట్మెంట్,ఆపరేషన్

సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు కోసం కావాల్సిన అన్ని సర్టిఫికేట్లు పక్కగా ఉంటాయి. అప్లికేషన్ తో పాటు ఆధార్,తెల్లరేషన్ కార్డు, ఆసుపత్రి ఇచ్చిన డిశ్చార్జీ సర్టిఫికేట్ తప్పకుండా సమర్పిస్తారు. కాని రోగికి అసలు రోగం ఉండదు. కాని ఆ రోగానికి ట్రీట్మెంట్,ఆపరేషన్ జరుగుతాయి. ట్రీట్మెంట్ చేసిన డాక్టరు పేరు, ఆపరేషన్ జరిగిన టైమ్,చివరికి డిచార్జీ సర్టిఫికేట్ కూడా కచ్చితంగా ఉంటాయి. ఇందుకు కావాల్సిన పేపర్ వర్క్ పక్కగా చేస్తారు. ఈ పక్రియలో కేవలం దరఖాస్తుచేసిన వ్యక్తి మాత్రమే నిజం. మిగతా అన్ని సృష్టించి రాజకీయ నాయకుల ప్రమేయంతో దరఖాస్తు చేసి డబ్బులు లాగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఉమ్మడి నల్గొండ,ఖమ్మం ఆసుపత్రులపై అనుమానం

ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబ్ బాద్ జిల్లాల నుంచి వచ్చే దరఖాస్తుల్లో ఎక్కువగా నకిలీలు ఉంటున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే అప్లికేషన్లపై ఒకటికి రెండు సార్లు స్క్రూటినింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆసుపత్రులకు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఆ జిల్లాల నుంచి వచ్చిన వందల అప్లికేషన్లను గుర్తించి పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. అయినా కొన్ని సార్లు నకిలీ దరఖాస్తులను పట్టుకోలేక పోతున్నరనే చర్చ జరుగుతోంది.

సీసీఎస్ లో కేసు నమోదు

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జ్యోతి, లక్ష్మి, ధీరా వత్, శివలు సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు సమర్పించిన ఆసుపత్రుల బిల్లులు చూసిన తర్వాత అనుమానం వచ్చిన రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. నకిలీ బిల్లులతో ప్రభుత్వ సొమ్మును కాజేసేందుకు ప్రయత్నించారని రెవెన్యూ డిపార్ట్మెంట్ (సీఎంఆర్ ఎఫ్) సెక్షన్ ఆఫీసర్ డీఎస్ఎన్ మూర్తి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. నకిలీ దరఖాస్తులు ఎలా వచ్చాయి. రోగుల ప్రమేయం ఉందా? ప్రజాప్రతినిధుల ఆఫీసుల్లో ఉండే స్టాఫ్ ప్రమేయం ఉందా? లేకపోతే హైదరాబాద్ లో పనిచేసే ప్రమేయం ఉందా?ఇందులో ఎవరి వాటా ఎంత?అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story