మాకు పార్టీ పని చెప్పండి.. బీజేపీ శ్రేణుల ఎదురుచూపులు

by samatah |
మాకు పార్టీ పని చెప్పండి.. బీజేపీ శ్రేణుల ఎదురుచూపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అన్ని పార్టీలు తమ తమ వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. వంద రోజుల యాక్షన్ ప్లాన్ పేరిట ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. కానీ ఆ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంలో పార్టీ తాత్సారం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా యాక్టివిటీ అనుకున్నంత స్థాయిలో జరగకపోవడమేనని శ్రేణులు భావిస్తున్నాయి. ఈ విషయాన్ని కాషాయ పార్టీ నేతలే చెప్పుకోవడం గమనార్హం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారిగా పార్టీ స్తబ్దుగా మారింది. దీనికి తోడు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయంతో నేతలందరూ విస్మయానికి గురయ్యారు. పార్టీ అన్నాక మార్పులు చేర్పులు సహజమని భావించి ముందుకు వెళ్దామని అనుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ యాక్టివిటీ లేకపోవడంతో నేతలు డీలాపడ్డారు.

కార్యారణలో విఫలం

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఇతర పార్టీల నేతలు నమ్మారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ఎంతో మంది సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. కానీ కేసీఆర్‌కు చెక్ పెట్టేలా అనుకున్న స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈ విషయంలో బీజేపీ వెనుకబడిందని పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. బయటకు చెప్పుకోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ సర్కార్‌ను ఇరుకున పెట్టే ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని లేవనెత్తడంలో బీజేపీ సభ్యులు విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలకు మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వకపోవడం, ఇచ్చినా తక్కువ సమయం కేటాయిస్తున్నారని సదరు నేతలు చెబుతున్నారు. దీంతో కిందిస్థాయి నేతల్లో నిరాశ నెలకొంది.

బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేనా?

బీజేపీలో బూత్ స్థాయి ఇన్‌చార్జులు, విస్తారక్, పాలక్‌లను నియమించినా వారితో క్షేత్రస్థాయిలో పనిచేయించుకోవడంలో వెనుకబడింది. పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఎలాంటి ముందడుగు పడకపోవడంతో నేతలు డైలమాలో పడ్డారు. అయితే అధికారంలోకి వచ్చేదెలా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. యాక్టివ్‌గా ప్రజల్లోకి ఇంకెప్పుడు వెళ్లేదని అంటున్నారు. పార్టీలో పవర్ ఫుల్ నేతలున్నా గ్రౌండ్‌లో యాక్టివిటీ అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ప్రజల్లో పార్టీని తీసుకెళ్లేదెలా నిరాశ చెందుతున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టి బీఆర్ఎస్‌కు చెక్ పెడుతుందా? లేదా? అనేది చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed