- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూభారతి చట్టం అమల్లోకి రాకముందే గ్రామాల్లో మరో వ్యవస్థ
దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి చట్టం అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికీ ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతున్నది. గత బీఆర్ఎస్ సర్కారు వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థలను రద్దు చేసి.. వారిని ఇతర శాఖల్లో రీడెప్లాయ్ చేసింది. ఇప్పుడు ప్రతి ఊరిలో ఒక ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం నియాకపు ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి పూర్వపు వీఆర్వో, వీఆర్ఏలకు ఆప్షన్లు ఇచ్చింది. వారిలో ఎంత మందిని అర్హతలను బట్టి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. రెవెన్యూ విలేజ్‌లో బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగికి ‘గ్రామ పరిపాలన ఆఫీసర్ (జీపీఓ)’గా పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. వీఆర్వోలను యథావిధిగా తిరిగి తీసుకొచ్చారంటూ బీఆర్ఎస్, విపక్షాలు విమర్శించే అవకాశమున్న నేపథ్యంలో ఈ మేరకు పేరు మార్చినట్లు తెలిసింది. పైగా రెవెన్యూ డిపార్ట్ మెంట్ పనులతోపాటు ఇతర బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పుడు కేవలం రెవెన్యూ అధికారిగా పిలవడం అసంపూర్ణంగా ఉంటుందన్న అభిప్రాయం నెలకొన్నది.
మొత్తంగా జనవరి నెలాఖరుకల్లా ప్రతి ఊరికో గ్రామ పరిపాలన ఆఫీసర్ (జీపీఓ) ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. భూ భారతి చట్టం-2024 రూల్స్ ఫ్రేం చేసి, అమలు చేయకముందే వీరందరినీ ఉద్యోగంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)ను నియమించారు. అలాగే ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారులుగా మారుస్తున్నారు. పేరు ఏదైనా ఊరికొకరు భూ పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగి నియామకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
వీఆర్వోల విధులు యథాతథం
గ్రామ పరిపాలన అధికారులుగా వచ్చే ఉద్యోగులకు అప్పటి వీఆర్వో విధులన్నీ యథాతథంగా ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ భూముల రక్షణ, ఇసుక, మైనింగ్ అక్రమ రవాణా నియంత్రణతోపాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు ఉంటాయని సమాచారం. ఇక భూ సమస్యల పరిష్కారంలో దరఖాస్తు విధానమంతా ఆన్ లైన్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఆ అప్లికేషన్ల పరిశీలన, సమస్య వాస్తవ రూపానికి రిపోర్టు మాత్రమే గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఇచ్చే వీలుంటుంది. భూ భారతి -2024 బిల్లు ప్రకారం తాత్కాలిక భూదార్, శాశ్వత భూదార్, భూదార్ కార్డుల జారీ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వం, మ్యుటేషన్ విచారణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, హక్కుల రికార్డుల తుది ప్రచురణ వంటివి అమలు చేయాలి. ధరణి పోర్టల్ లో తప్పొప్పుల సవరణతోపాటు అసలే నమోదు కాకుండా పార్ట్-బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్ట్-బి కింద పేర్కొన్న వాటిని ఏబీసీడీ వర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ఆ భూ సమస్యల స్థితి, స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలాంటి అనేకాంశాల్లో గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారుతున్నది.
అడ్డగోలుగా వీఆర్వో వ్యవస్థ రద్దు
రెవెన్యూ శాఖలో వీఆర్వోలకు 6-24 ఏండ్ల అనుభవం ఉంది. ప్రభుత్వం-ప్రజల మధ్య వారధిగా ఉన్న పూర్వ వీఆర్వోలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా, నియంతృత్వంగా ‘తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దు చట్టం-2020’ ద్వారా రెవెన్యూ శాఖ నుంచి తప్పించింది. తత్ఫలితంగా సుమారు ఏడువేల పైచిలుకు పోస్టులు రద్దయ్యాయి. అంతేకాకుండా 5,138 మంది వీఆర్వోలను మిగులు సిబ్బందిగా పేర్కొన్నారు. చట్టంలోని సబ్-సెక్షన్ 4(1)కు విరుద్ధంగా ఆర్థిక శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 121, తేదీ: 23.07.2022 తీసుకొచ్చి, రీ డిప్లాయ్ మెంట్ పేరుతో 2022 ఆగస్టు ఒకటో తేదీన లాటరీ విధానం ద్వారా వారిని ఇతర శాఖలు, కార్పొరేషన్లలో బలవంతంగా బదిలీ చేశారు. అర్ధరాత్రి తమ చేతుల్లో ఆర్డర్లు పెట్టి, ఉద్యోగ జీవితాలకు ఉరి వేసి, కుటుంబాలను భయకంపితులను చేసి కుంగదీశారని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ హక్కులు కాలరాశారని, అవమానానికి గురి చేశారని వాపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యోగుల జీవితాలను గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నది.
తిరిగి రానున్న ‘మిగులు సిబ్బంది’
గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థ రద్దు చేసి 5,138 మందిని మిగులు సిబ్బందిగా పేర్కొన్న ప్రభుత్వం.. మరోవైపు సిబ్బంది కొరత పేరుతో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించింది. ‘గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థ రద్దు చట్టం-2023’ ద్వారా వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. వీఆర్వోలకు అసిస్టెంట్లుగా ఉన్న సుమారు ఐదువేల వీఆర్ఏలను ఎలాంటి నియామక విధానం, నిబంధనలు పాటించకుండా రెవెన్యూలోని తహశీల్దార్ కార్యాలయాల్లో నేరుగా జూనియర్ అసిస్టెంట్లుగా నియమించింది. ఆ తర్వాత వారిని శాశ్వతం చేసి, సీనియారిటీ పరంగా వారికి రెవెన్యూలో ముందు వరుసలో కొనసాగించిందని పూర్వ వీఆర్వోలు వాపోతున్నారు. అధికార దుర్వినియోగం చేసి తమకు ఉద్దేశపూర్వకంగా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆవేదనకు పరిష్కారం లభించే అవకాశమున్నది.