కేసీఆర్‌కు బిగ్ షాక్.. తెలంగాణలో పోటీకి సిద్ధం అవుతున్న మరోపార్టీ?

by GSrikanth |   ( Updated:2023-02-24 13:59:19.0  )
కేసీఆర్‌కు బిగ్ షాక్.. తెలంగాణలో పోటీకి సిద్ధం అవుతున్న మరోపార్టీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కలిసి వచ్చే పార్టీల కోసం గులాబీ బాస్ కేసీఆర్ ఆరా తీస్తుంటే ఆయనతో కలిసి నడుస్తారని భావిస్తున్న మిత్రుడు ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. త‌మిళ‌నాడుకు చెందిన విదుతాలై చిరుతైగ‌ల్ క‌చ్చె(వీసీకే) పార్టీ వైఖరి ఇప్పుడు కారు పార్టీలో కలవరపాటుకు గురి చేస్తోందట. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చే కార్యక్రమానికి రాష్ట్రానికి వచ్చిన వీసీకే పార్టీ అధినేత ఎంపీ తిరుమావళవన్‌ సీఎం కేసీఆర్ పక్కనే కూర్చుని చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వీసీకే భవిష్యత్‌లో బీఆర్ఎస్‌లో విలీనం అవుతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ, అనూహ్యంగా తిరుమావళన్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.


ఏపీలో ఇప్పటికే పార్టీ ఆఫీస్ ప్రారంభించిన ఎంపీ తిరుమావళవన్‌ ఇటీవల తెలంగాణలో పర్యటించి పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామమే గులాబీ పార్టీలో చర్చగా మారుతోంది. తమకు మద్దతుగా నిలుస్తారనుకున్న వీసీకే అధినేత రూటు మార్చి ఏకంగా తెలంగాణలో పార్టీని విస్తరించే ప్రణాళికను వేసుకోవడం పట్ల కేసీఆర్ ఆలోచనలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో సొంతంగా ఎదగాలనే ప్రయత్నాలతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే పోటీ చేస్తుందనే సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తోంది.

తమిళనాడులో బీఆర్ఎస్‌ను విస్తరించడానికి వీసీకే తమకు ఓ వారధిగా ఉంటుందని గులాబీ నేతలు భావించారు. అయితే ఇప్పుడు అదే వీసీకే పార్టీ తెలంగాణలో పోటీకి దిగే ప్రయత్నాలు చేయడం సంచలనం రేపుతోంది. ప్రస్తుతం వీసీకే పార్టీకి తమిళనాడులో నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు ఓ ఎంపీ ఉన్నారు. ఆ రాష్ట్ర దళిత సామాజిక వర్గంలో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణలో పోటీ చేస్తే బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందా లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అనేది సందేహాంగా మారింది. ఒకవేళ ఒంటరిగానే పోటీ చేస్తే దాని వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు ఏంటి అనేది ఉత్కంఠ రేపుతోంది. గతంలో కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఎదుర్కోవాలనే ప్రతిపాదనను వీసీకే అధినేత తిరుమావళవన్‌ కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారనే ప్రచారం వినిపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వీసీకే పోటీ చేయాలనే టాక్ ఇటు గులాబీ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చగా మారుతోంది.

Advertisement

Next Story