free current: ఉచిత విద్యుత్ స్కీమ్ పై గుడ్ న్యూస్.. వారికీ వర్తింప చేయాలని భట్టీ ఆదేశాలు

by Prasad Jukanti |
free current: ఉచిత విద్యుత్ స్కీమ్ పై గుడ్ న్యూస్.. వారికీ వర్తింప చేయాలని భట్టీ ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం లబ్ధిదారుల విషయంలో డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. గృహ జ్యోతి పథకానికి అన్ని అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి అలాంటి వారికీ ఈ స్కీమ్ వర్తింప చేయాలని రాష్ట్ర విద్యుత్ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. బుధవారం ప్రజా భవన్ లో ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమస్య సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ జ్యోతి పథకం అమలు తీరుపై భట్టి విక్రమార్క అధికారులతో ఆరా తీశారు. విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జెన్ కో విద్యుత్ ఉత్పత్తి లో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం జరిగిన సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని, ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కాళేశ్వరం కరెంట్ ఖర్చులపై నివేదిక ఇవ్వండి:

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్ -1 లో జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతులు చేయాలా లేక కొత్తది కొనుగోలు చేయాలా అనే అంశం టెక్నికల్ కమిటీ పరిశీలిస్తున్నదని భట్టి వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు చేసే సమమయంలో సీఎండీలు తప్పనిసరిగా ఎనర్జీ సెక్రటరీని సంప్రదించాలని, ఆలాగే వాటి అమలుకు సంబంధించి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి నివేదించాలన్నారు. జల విద్యుత్ కేంద్రాల్లోని సాంకేతిక సమస్యలపై అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ మొదలైదని, అందులోని 113 సబ్ స్టేషన్లకు స్థల సమస్య లేదన్నారు. మిగతా వాటికి కలెక్టర్లు స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. కాళేశ్వరంతో సహా ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల విద్యుత్ ను ఉపయోగిస్తున్నారు? ఇందుకు ఎంత మేర వ్యయం అవుతున్నదో మొత్తం వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story