Tech Mahindra: దోహాలో టెక్ మహీంద్ర ఉద్యోగి అరెస్టు.. ఎందుకంటే?

by Shamantha N |
Tech Mahindra: దోహాలో టెక్ మహీంద్ర ఉద్యోగి అరెస్టు.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖతార్‌లో గుజరాత్‌కి చెందిన టెకీ అమిత్ గుప్తా అరెస్ట్ రెండు దేశాల మధ్య దౌత్య వివాదంగా మారింది. ప్రస్తుతం టెక్ మహీంద్రా ఖతార్, కువైట్‌ రీజినల్ హెడ్ గా గుప్తా పనిచేస్తున్నారు. కాగా.. ఆయన్ని జనవరి 1న దోహాలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డేటాను చౌర్యం కేసులో గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా.. ఈ అరెస్ట్‌పై టెక్ మహీంద్రా కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగి కుటుంబంతో టచ్‌లో ఉన్నట్లు చెప్పింది. ‘‘మేం మా ఉద్యోగి కుటుంబంతో టచ్ లో ఉన్నాం. వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తాం. రెండు దేశాల్లోని అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. చట్ట ప్రక్రియకు కట్టుబడి ఉన్నాము. మా సహోద్యోగి శ్రేయస్సును నిర్ధారించడమే మాకు ప్రధానం’’ అని టెక్ మహీంద్ర ప్రతినిధి తెలిపారు.

ఎంపీని కలిసిన గుప్తా తల్లి

అయితే, డేటా చౌర్యం కేసులో అమిత్ గుప్తాని అరెస్ట్ చేయగా.. అతడి కుటుంబం మాత్రం నిర్దోషి అని చెబుతోంది. ‘‘జనవరి 1న అమిత్ గుప్తాని అదుపులోకి తీసుకున్నారు. 48 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా ఉంచారు. ఆ తర్వాత అతడిని ఒక గదిలో బంధించారు. మూడు నెలలుగా దోహాలోనే ఉంచారు. అతడిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు’’ అని అమిత్ గుప్తా తల్లి పుష్ప గుప్తా చెప్పారు. కంపెనీలో ఎవరో ఏదో తప్పు చేసి ఉండొచ్చని.. అతను కంపెనీ మేనేజర్ కాబట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు అని ఆమె అన్నారు. రెండు రోజులుగా తన కుమారుడు కాల్స్ ఆన్సర్ చేయకపోతే.. అతడి స్నేహితుల ద్వారా విషయం తెలిసిందని పుష్ప తెలిపారు. తాను దోహా వెళ్లి అరగంట పాటు అతనిని కలిశానని కూడా తెలిపింది. సహాయం కోసం ఆమె వడోదర ఎంపీ హేమాంగ్ జోషితో పుష్ప భేటీ అయ్యారు. ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయానికి కూడా అతడి నిర్బంధం గురించి తెలుసునని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Next Story