సెర్చింగ్ ఫర్ మాస్‌ లీడర్స్... వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ మరో స్కెచ్!

by GSrikanth |
సెర్చింగ్ ఫర్ మాస్‌ లీడర్స్... వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ మరో స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్ కేసీఆర్ వచ్చే ఎన్నికలపై గట్టిగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలున్న సెగ్మెంట్లలో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మొదటి నుంచీ పార్టీలో ఉన్న నేతలు.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నేతల మధ్య తీవ్రమైన గ్యాప్ ఉంది. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూసే అవకాశం ఉంది. ఎన్నికల టైంలో వారంతా జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు. అటువంటి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటి? అని కేసీఆర్ అరా తీస్తున్నట్టు సమాచారం. ఆయా సెగ్మెంట్లలో పరిస్థితి ఏమిటని కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఒకవేళ అక్కడ ఇతర పార్టీలకు చెందిన నేతలు బలంగా ఉంటే.. వారిని బీఆర్ఎస్‌లో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన బాధ్యతలను మంత్రులకు అప్పజెప్పినట్టు టాక్. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసం గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా వరకు బలమైన నేతల వివరాలను సేకరించే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు.

కేసీఆర్ చేతిలో జంపింగ్‌ల లిస్ట్

బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలు, టికెట్ రాని నేతలు ఎన్నికల టైంలో పార్టీ మారే అవకాశం ఉంది. ప్రతి ఎన్నికల్లో ఇలాంటివి సహజం. అయితే వాటికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే కార్యచరణ రూపొందిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలను సేకరిస్తున్నారు. ఎవరెవరూ పార్టీని వీడే అవకాశం ఉందని, పక్కచూపులు చూస్తున్నవారి లిస్టును ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. 30 నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఆ నాయకుల స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను జిల్లా మంత్రులకు అప్పగించారు. ప్రతిపక్ష పార్టీల్లో ఏ నేత బలంగా ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్‌లో ఉండి ప్రతిపక్ష నేతలకు సపోర్టుగా ఉంటున్నవారెవరు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారి వ్యవహారశైలీ ఏ విధంగా ఉండబోతుందని.. పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తారా? లేదా? అనే వివరాలను క్షుణ్ణంగా సేకరిస్తున్నారు. జపింగ్ చేసే అవకాశం ఉన్న నేత స్థానంలో మరో నేతను ఇతరపార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు తెలియకుండా వివరాలను మంత్రులు గోప్యంగా సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్నారు. అయితే ఆ నియోజకవర్గాల్లో జడ్పీ చైర్మన్లను, ఎంపీలను ఇన్‌చార్జులుగా నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల్లో కేడర్ నేతల మధ్య కోఆర్డినేషన్ చేయడానికి జిల్లా ఇన్‌చార్జులను సైతం నియమించారు. ఇప్పుడు వీరందరిని కోఆర్డినేషన్ చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించినట్లు సమాచారం.

మంత్రుల పనితీరుపై ఆరా

జిల్లాపై మంత్రికి ఏమేర పట్టుందో తెలుసుకునేందుకే టాస్క్ పెట్టినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి వీడే నేతల స్థానంలో మరో బలమైన నేతలను చేర్చుకోవడం వారి పనితనానికి నిదర్శనం కానుంది. పార్టీ అభ్యర్థులకు టికెట్ కేటాయింపు విషయంలోనూ మంత్రుల అభిప్రాయం తీసుకొని గెలిపించుకునే సత్తాను సైతం బేరీజు వేయనున్నారు కేసీఆర్. అంతేగాకుండా ఎమ్మెల్యేలు, నేతలు, ప్రజల్లో మంత్రులకు ఉన్న ఆదరణపై సైతం ఆరా తీస్తున్నారు. వారి సత్తాను బట్టే రాబోయే రోజుల్లో తిరిగి పార్టీ పదవులుగానీ, మంత్రి పదవులు గానీ తిరిగి అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed