సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన?

by GSrikanth |
సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన?
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అవుతున్నది. ఈ మేరకు టికెట్ల ఎంపికపై కసరత్తు చేస్తున్నది. ఏఐసీసీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు సర్వే ఆధారంగానే సీట్లను ఎంపిక చేస్తున్నప్పటికీ, టీపీసీసీ, ఏఐసీసీ సమన్వయంతో ఓ జాబితాను తయారు చేస్తున్నారు. దీన్ని జనవరి 1 తర్వాత ఢిల్లీకి పంపించనున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత లోక్ సభ అభ్యర్థుల లిస్టును ప్రకటించే చాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పది రోజుల కిందట స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. దీంతో పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు పలువురు కీలక నేతలంతా రెడీ అవుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు పొందలేని నేతలతో పాటు పోటీ చేసి ఓడిపోయినోళ్లు, కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి పనిచేస్తున్న నేతలంతా ఎంపీ టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సీఎం, మంత్రుల చుట్టూ టికెట్ల కోసం తిరుగుతుంటే, మరికొందరు ఏకంగా ఢిల్లీలోనే మకాం వేసి తమ దైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లో ఉన్నందున ఈసారి ఎంపీ టికెట్లకు ఎక్కువ పోటీ నెలకొన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇటీవల విడుదలైన వివిధ ప్రైవేట్ సంస్థల సర్వేల్లోనూ కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. దీంతో నేతల్లో కాంపిటీషన్ పెరిగింది.

మెజార్టీ సీట్లు కొట్టాల్సిందే..?

రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు కొట్టాల్సిందేనని ఇప్పటికే ఏఐసీసీ ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్ర నేతలంతా ఇప్పట్నుంచే ఎంపీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉండగా, హైదరాబాద్, ఆదిలాబాద్ సీట్లపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకోలేదు. మిగతా 15 పార్లమెంట్ సెగ్మెంట్లలో గెలవాలని లక్ష్యం పెట్టుకోగా, మినిమం 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎక్కువ మంది ఎంపీలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నది. ఈ మేరకు ఏ జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలిచాం..? పార్టీ ఎక్కడెక్కడ వీక్ ఉన్నది? వంటి అంశాలను వార్ రూమ్ రిపోర్టు తయారు చేస్తున్నది. ప్రస్తుతం 13 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు సాధించింది. మిగతా చోట స్పల్ప ఓటింగ్ శాతంతో సీట్లను కోల్పోయింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వార్ రూమ్ టీమ్ ఓ ప్రణాళికను రెడీ చేస్తున్నది. పార్లమెంట్‌ ఎన్నికల్లోన కాంగ్రెస్ సత్తా చాటేందుకు ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఓ రాష్ట్ర మంత్రి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుంగా, ఒక్కో ఏఐసీసీ నేత పార్లమెంట్ అబ్జర్వర్‌గా కొనసాగుతున్నారు.

ఫుల్ డిమాండ్..

ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఈ సెగ్మెంట్లలో సులువుగా గెలుస్తామనే భరోసాతో నేతలంతా టికెట్ల కోసం ట్రై చేస్తున్నారు. ఇక పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్ల సీట్లలోనూ కొంత కష్టపడితే గెలవచ్చని పార్టీ భావిస్తున్నది. సీఎం రేవంత్ గతంలో ఎంపీగా ఎన్నికైన మల్కాజ్‌గిరితో పాటు సికింద్రాబాద్‌లో జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ప్రణాళికను రెడీ చేస్తున్నది. మరోవైపు నిజామాబాద్, మెదక్‌లో ఎక్కువ అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ సాధించినా.. గ్రౌండ్ కేడర్‌ను గుంజడం వలన ఈ రెండు సీట్లలోనూ విజయం సాధించవచ్చనే అభిప్రాయంలో పార్టీ ఉన్నది. కానీ ఆదిలాబాద్‌లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవగా, హైదరాబాద్‌లో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రెండు సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్నది.

పోటీ పడుతున్న ప్రధాన నేతలు వీళ్లే..

కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ ప్రవీణ్​రెడ్డి కూడా రేసులో ఉన్నారు. వీరితో పాటు రోహిత్ రావు, ఉదయానంద రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, పేరి కన్యమ్, ఏ.చంద్రశేఖర్, ఆదిలాబాద్ నుంచి నరేశ్ జాదవ్, సేవాలాల్ రాథోడ్‌తో పాటు ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్ రాథోడ్(ఐఆర్ఎస్) కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి మహేశ్ కుమార్ గౌడ్, ఈరావత్రి అనిల్, ధర్మపురి సంజయ్, మెదక్ పార్లమెంట్ నుంచి జగ్గారెడ్డి, విజయశాంతి, నిర్మలా జగ్గారెడ్డి అనిల్ కుమార్, జహీరాబాద్ నుంచి సురేశ్ శట్కర్, మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి మైనంపల్లి హన్మంతరావు, హరివర్ధన్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, వినోద్ రెడ్డి, నవీన్ యాదవ్, డాక్టర్ వినయ్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ నుంచి కేఎల్ఆర్, చిగురింత పారిజాత, మర్రి ఆదిత్య రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి వంశీచంద్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, ఆదిత్య రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్, నల్లగొండ పార్లమెంట్ నుంచి జానారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, కోమటిరెడ్డి లక్ష్మి, బండి సుధాకర్ గౌడ్, వరంగల్ పార్లమెంట్ నుంచి అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ, దొమ్మటి సాంబయ్య, మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, నెహ్రూ నాయక్, భట్టు రమేశ్, ఖమ్మం పార్లమెంట్ నుంచి వీహెచ్, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కుసుమ కుమార్, పొట్ల నాగేశ్వర్, హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story