విద్యుత్ విజన్ @ 2030.. బడ్జెట్‌లో విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు

by Mahesh |
విద్యుత్ విజన్ @ 2030.. బడ్జెట్‌లో విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు కేటాయింపులు చేస్తూ ప్రతిపాదనలు చేసింది. విద్యుత్ విజన్ 2030 కి అనుగుణంగా కరెంట్ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక పెట్టుకుంది. సాంప్రదాయేతర, కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర అవసరాలకు సరిపోయే విధంగా కాకుండా, మిగులు విద్యుత్ సాధించేలా పాలసీలో తగిన ప్రణాళిక చేయనున్నారు. నూతన విద్యుత్ విధానంలో సౌరశక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారు. భవిష్యత్ లో కాలుష్యరహిత విద్యుత్ సాధనలో అగ్రగామిగా నిలిచేలా ప్రణాళిక రూపొందించనున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోని వినియోగదారులతో పాటు, అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ ను ప్రతిపాదించింది. గత ప్రభుత్వ ఆర్థిక క్రమ శిక్షణా రాహిత్యానికి బలైన విద్యుత్ సంస్థలను గాడిలో పెడుతున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది.

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, ట్రాన్స్ మిషన్ నష్టాలు తగ్గించి నెట్ వర్క్ బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11 కొత్త ఎక్స్ ట్రా హై టెన్షన్ సబ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు స్పష్టంచేశారు. అలాగే 31 ఎక్స్ ట్రా హై ఓల్టేజ్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు కోసం రూ.3,017 కోట్ల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో భౌగోళిక అనుకూలతలు గల ప్రదేశాల్లో స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం 450 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఉండగా, అదనంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో 100 స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రజలకు చార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులోనికి తీసుకురావడానికి టీజీఈవీ మొబైల్ యాప్ ను ఏర్పాటు చేయనున్నారు.

ఇదిలా ఉండగా విద్యుత్ రంగానికి గతేడాది కంటే అధికంగా నిధులు కేటాయించారు. గతేడాది బీఆర్ఎస్.. రూ.12727 కోట్లను ప్రతిపాదించగా అది రూ.16,158 కోట్లకు పెరిగింది. కాగా ఈసారి కాంగ్రెస్ హయాంలో రూ.16410 కోట్లను విద్యుత్ శాఖకు ప్రతిపాదించారు. ఈసారి కేటాయింపులు పెరిగినా విద్యుత్ సంస్థలు నష్టాల ఊబి నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం.. విద్యుత్ సంస్థలను నష్టాల ఊబిలో నుంచి ఎలా గట్టెక్కిస్తుందనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed