మా భూముల్ని కాపాడండి.. అంబేడ్కర్ వర్శిటీ ఎంప్లాయీస్ జేఏసీ నిరసన

by Gantepaka Srikanth |
మా భూముల్ని కాపాడండి.. అంబేడ్కర్ వర్శిటీ ఎంప్లాయీస్ జేఏసీ నిరసన
X

దిశ, తెలంగాణ బ్యూరో: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు కోసం డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ భూముల్ని ఇవ్వాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. అంబేడ్కర్ వర్శిటీ ప్రాంగణంలో పది ఎకరాలను ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీకి ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అంబేడ్కర్ వర్శిటీ అవసరాలకు సరైన భవనాలు లేవని, ఖాళీ స్థలం ఉన్నా గుట్టలు, రాళ్ళతో వినియోగించుకోలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ఫైన్ ఆర్ట్స్ వర్శిటీకి ఇస్తే ఇబ్బందులు స్థలాభావ సమస్యలు ఉత్పన్నమవుతాయని జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆ ప్రతిపాదనను విరమించుకునేలా ప్రభుత్వానికి తెలియజేయాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధారాణికి మెమోరాండం సమర్పించారు. అంబేడ్కర్ వర్శిటీ కొన్ని లక్షల మంది విద్యార్థులకు సేవలందిస్తూ ఉన్నదని, ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ వర్శిటీకి పది ఎకరాలను ఇస్తే సొంత యూనివర్శిటీకి భవిష్యత్తు అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందులొస్తాయన్నారు.

ప్రభుత్వ నిర్ణాయానికి నిరసనగా గురువారం అంబేడ్కర్ వర్శిటీ పరిపాలనా భవనం దగ్గర నిరసన తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడుతున్న ఈ విశ్వవిద్యాలయం ఎంతో మంది సబ్బండ, పేద విద్యార్థులకు దూర విద్య ద్వారా వెసులుబాటు కల్పిస్తున్నదన్నారు. విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ ఉన్నదని, ఇప్పటికే యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్స్, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిపోవడంలేదన్నారు. ఫలితంగా అటు విద్యార్థులు, ఇటు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల అవసరాల కోసం బిల్డింగ్స్ నిర్మించాల్సిన అవసరం ఉన్నదని, గుట్టలు రాళ్లతో నిండిన క్యాంపస్‌లో ఒక్క ఎకరం జాగా కూడా నిర్మాణాలకు అనువుగా లేదన్నారు. ఈ యూనివర్సిటీ స్థలాలను ఇతర వర్శిటీలకు, ఇతర అవసరాలకు కేటాయిస్తే భవిష్యత్తులో ఈ యూనివర్సిటీ అభివృద్ధికీ, విస్తరణకు అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధారాణికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఫేకల్టీ తరపున ప్రొఫెసర్లు పల్లవి కాబ్దే, పుష్పా చక్రపాణి, మాధురి, చంద్రకళ, వెంకట రమణ, భోజు శ్రీనివాస్, బానోత్ ధర్మ, వెంకటేశ్వర్లు, ఎల్వీకే రెడ్డి, కృష్ణారెడ్డి, ఎన్సీ వేణుగోపాల్, నారాయణ రావు, మహేశ్వర్ గౌడ్, ఎండీ హబీబుద్దీన్, కాంతం ప్రేమ్ కుమార్, యాకేష్ దైద, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed