అంబేద్కర్‌కు రుణపడి ఉన్నాం: స్పీకర్ పోచారం

by GSrikanth |   ( Updated:2023-04-14 14:13:08.0  )
అంబేద్కర్‌కు రుణపడి ఉన్నాం: స్పీకర్ పోచారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ జయంతి రోజున రాజకీయాలు తగదని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోని విగ్రహానికి మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. గాంధీతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే.. పరిపాలన పద్ధతులు, దేశ పౌరులు శాంతి పూర్వకంగా బతకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి అంబేద్కర్‌ అని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలతో మంచి పరిపాలన జరుగుతుందని ఆర్టికల్‌ 3లో అంబేద్కర్‌ పేర్కొన్నారని, ఆ ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని, అందుకు ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పారు.

125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని వెల్లడించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా భావిస్తారన్నారు. రాజ్యాంగంలో ఆయన చేర్చిన నిబంధన వల్లే తెలంగాణ సాధించుకోగలిగామని చెప్పారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణ.. దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో మొక్కనాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, భానుప్రసాదరావు, శంభీపూర్ రాజు, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

Also Read..

‘అంబేద్కర్’ సాక్షిగా కేసీఆర్ కాళ్లు మొక్కిన మంత్రి కొప్పుల

Advertisement

Next Story