డేంజర్ జోన్‌లో ఆమనగల్లు సుర సముద్రం..భయందోళనలో స్థానికులు

by Jakkula Mamatha |
డేంజర్ జోన్‌లో ఆమనగల్లు సుర సముద్రం..భయందోళనలో స్థానికులు
X

దిశ, ఆమనగల్లు:ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని సుర సముద్రంలోకి భారీగా వర్షం నీరు చేరుతుంది. ఇంతలా భారీ వర్షపు నీరు చేరడం గత 50 సంవత్సరాలుగా చూడటం ఇదే మొదటిసారి అని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికే సుర సముద్రం ఉధృతంగా అలుగు పారుతుంది. నిమిష నిమిషానికి ఆ ఉద్ధృతి ఎక్కువ అవుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తలకొండపల్లి మండలం ఎడవల్లి చెరువు కట్ట తెగి ఆమనగల్లు సుర సముద్రంలోకి వరద నీరు వస్తుండడం, మరియు మంగళపల్లి చుక్కాపూర్ విటాయిపల్లి గ్రామ చెరువులు అలుగు పారి సుర సముద్రంలోకి చేరుతుండడంతో అలుగు ఉధృతంగా పారి, నీటి సామర్థ్యం పెరుగుతుంది.

షాద్‌నగర్ రోడ్డులోని దర్గాకు ఎదురుగా చెరువు కట్టపై ఉన్న మట్టి నిమిషం నిమిషానికి కొట్టుకుపోతూ ఆ ప్రదేశంలో ప్రమాదం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నివారణ చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటన పై స్పందించిన ఇరిగేషన్ ఏఈ జంగయ్య నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎడవెల్లి గ్రామ చెరువు తెగి వరద నీరు ఉధృతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎడవల్లి చెరువు వరద నీరు ఉధృతి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. మరి కొన్ని నిమిషాల్లో ఆమనగల్లు సుర సముద్రం చేరుకొని పరిస్థితులను చక్కదిద్దుతాం అని పేర్కొన్నారు.

Advertisement

Next Story