వారికి టెండర్లు దక్కేలా మంత్రి ఉత్తమ్ ప్లాన్.. యూ-ట్యాక్స్‌పై మరోసారి ఏలేటి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
వారికి టెండర్లు దక్కేలా మంత్రి ఉత్తమ్ ప్లాన్.. యూ-ట్యాక్స్‌పై మరోసారి ఏలేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సన్న బియ్యం సేకరణలో ప్రభుత్వ విధానంపై పలు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. అవినీతిని ప్రశ్నిస్తున్న తమపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసులకు భయపడేది లేదు.. కుంభకోణంపై పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావాల్సిన వారికి టెండర్లు దక్కేలా నిబంధనల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారం మార్పులు చేశారని అన్నారు. మిల్లర్ల నుంచి భారీ ఎత్తున యూ-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు.

నూక ఉన్న సన్న బియ్యం రూ.56 కొంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు పడిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీజేపీతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన శాఖ నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని మరోసారి విమర్శించారు. అసలు ఉత్తమ్‌కు రైతాంగ సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story