లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పైనా ఆరోపణలు.. నేడు సీఎం కౌంటర్ ఇస్తారా?

by GSrikanth |   ( Updated:2022-12-04 00:00:51.0  )
లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పైనా ఆరోపణలు.. నేడు సీఎం కౌంటర్ ఇస్తారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ ఇప్పుడు కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారించేందుకు మంగళవారం ఇంటికి రానుంది. అయితే అంతకుముందే పాలమూరులో మహబూబ్ నగర్ కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ స్పీచ్ లో లిక్కర్ స్కామ్, కూతురుకు నోటీసులపై ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. కేంద్రానికి కౌంటర్ ఇస్తూనే, దర్యాప్తు సంస్థలపై దాడి చేసే అవకాశముంది.

విచారణలు, సోదాలతో ఉక్కిరిబిక్కిరి

కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు, విచారణలతో టీఆర్ఎస్ లీడర్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను సాక్షిగా విచారించేందుకు సీబీఐ రెడీ అయింది. రెండు రోజులు ముందే నకిలీ సీబీఐ శ్రీనివాస్ కేసులో మంత్రి గంగుల, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఢిల్లీకి పిలిచి విచారించింది. మూడు రోజుల క్రితం ఈడీ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థలపై ఫోకస్ పెట్టింది. ఐటీ అధికారులు మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లలో సోదాలు జరిపారు. క్యాసినో కేసులో ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మంత్రి తలసాని కొడుకు సాయికిరణ్ ను విచారించింది.

కేసీఆర్ కౌంటర్ ఏంటీ?

కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులపై సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్తారోననే ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మోడీ, అమిత్ షా విషయంలో కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. మునుగోడు బై ఎలక్షన్ టైమ్ లో జరిగిన బహిరంగ సభలోనే ఘాటుగా స్పందించారు. ఇప్పుడు వారిద్దరిపై పబ్లిక్ మీటింగ్ లో ఏ మేరకు తిట్ల దండకం అందుకుంటారోననే ఆసక్తి నెలకొంది. తాజాగా లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ ప్రమేయం కూడా ఉందని తరుణ్ చుగ్ ఆరోపించారు. బలమైన ఆధారాలు ఉండటంతోనే బీజేపీ అధిష్టానం ఆయనతో మాట్లాడించిందనే చర్చ జరుగుతున్నది. ఒకవైపు తన కూతురు కవితకు సీబీఐ నోటీసులు, అదే కేసులో తన ప్రమేయం ఉందని చెప్పడంపై కేసీఆర్ కోపంగా ఉన్నట్టు ప్రగతిభవన్ కు దగ్గరగా ఉండే లీడర్లు చెప్తున్నారు. ఆకోపం మొత్తాన్ని పాలమూరు పబ్లిక్ మీటింగ్ లో చూపేంచే చాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది.

'సిట్' తో బీజేపీపై ఎటాక్

బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఎటాక్ చేయడానికి ఫామ్ హౌజ్ కేసు సరైన అస్త్రం అనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలను సిట్ ద్వారా దేశ ప్రజలకు వివరించే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. త్వరలో చేపట్టనున్న ఢిల్లీ పర్యటనలో అదే ప్రధాన ఎజెండాగా కేసీఆర్ పెట్టుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఇదే కేసులో అమిత్ షాకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed