- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మహా’ ఎన్నికల్లో తెలంగాణ ముద్ర.. ఏఐసీసీ నయా ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముద్ర కనిపించేలా ఏఐసీసీ ప్లాన్ చేస్తున్నది. ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు ముందు డిక్లరేషన్ల ద్వారా, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలను, ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేసిన విషయాన్ని మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్‌లో వివరించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్కలను సీనియర్ అబ్జర్వర్లుగా నియమించిన ఏఐసీసీ, జార్ఖండ్ ఎన్నికలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నియమించింది. రానున్న రోజుల్లో మరికొంత మంది మంత్రులను సైతం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ఆదేశించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణతో సరిహద్దు రాష్ట్రంగా ఉన్నందున ఇక్కడి ప్రభావం మహారాష్ట్ర ఓటర్లపై పడుతుందనేది హైకమాండ్ భావన. ఇక్కడి స్కీమ్‌లను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయొచ్చన్న లక్ష్యంతో ఏఐసీసీ ఆ దిశగా పావులు కదుపుతున్నది.
స్కీమ్స్ అమలుపై వివరించేందుకు..
గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రెండు నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందేందుకు రూ.10 లక్షల వరకూ పరిమితిని పెంచింది. ఇదే విషయాన్ని తెలంగాణ నేతలు మహారాష్ట్ర ఎన్నికల్లో వివరించనున్నారు. దేశంలోనే మరే రాష్ట్రం అమలు చేయని తీరులో నెల రోజుల వ్యవధిలోనే రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ అమలు చేసిన అంశాన్ని సైతం నొక్కిచెప్పనున్నారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏడాదిన్నరలో సాకారమయ్యేలా జాబ్ క్యాలెండర్‌ను అసెంబ్లీ వేదికగానే ప్రభుత్వం ప్రకటించిన విషయాన్నీ క్యాంపెయిన్‌లో రాష్ట్ర మంత్రులు, పార్టీ నేతలు వివరించనున్నారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి స్కీముల గురించి ప్రచారం చేయనున్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు ఖరీఫ్ సీజన్‌కు ఒక్కో క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించే దానిపైనా ప్రచారం చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడువేల చొప్పున రాష్ట్రం మొత్తం మీద నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని క్యాంపెయిన్‌లో రాష్ట్ర మంత్రులు, నేతలు ప్రచారం చేయనున్నారు. త్వరలోనే ఏఐసీసీ, పీసీసీ మధ్య చర్చల్లో రాష్ట్రం నుంచి ఎవరెవరిని ఎక్కడెక్కడ ప్రచారం చేయించాలో షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాలతో మహారాష్ట్రకు సరిహద్దు ఉన్నందున ఇక్కడి లీడర్లకు అక్కడి అసెంబ్లీ సెగ్మెంట్లతో పరిచయం ఉండడంతో వీరిని పంపాలన్నది పీసీసీ భావన. మహారాష్ట్రలోని గడ్‌చిరోలి, చంద్రపూర్, యావత్‌మల్, నాందేడ్ జిల్లాలకు తెలంగాణతో సరిహద్దు ఉన్నది. పది అసెంబ్లీ నియోజకవర్గాలతో తెలంగాణ ప్రాంతానికి నేరుగా కనెక్షన్ ఉంటుంది. గడ్‌చిరోలి (ఎస్టీ), అహిరి (ఎస్టీ), రాజుర, వణి, అర్ణి (ఎస్టీ), కిన్వట్, హడ్‌గావ్, భోకర్, నయీగావ్, డేగ్లూర్ (ఎస్సీ) తదితర నియోజకవర్గాలన్నీ తెలంగాణ జిల్లాలను ఆనుకునే ఉంటాయి. ఈ సెగ్మెంట్లతో తెలంగాణ ప్రజలకు నిత్యం సంబంధాలు, రెండు వైపులా రాకపోకలూ ఉంటాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రభావం ఉంటున్నందున అమలయ్యే పథకాలను అక్కడ వివరించడం ద్వారా కాంగ్రెస్ పట్ల ఓటర్లలో అవగాహన పెరుగుతుందన్నది పార్టీ నేతల ఉద్దేశం. కేవలం హామీలు ఇవ్వడానికే పరిమితం కాకుండా అమల్లోకి తెచ్చిన అంశాలనూ వివరించడం ద్వారా ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది.