ఎమ్మెల్యేల చేరికలకు AICC గ్రీన్ సిగ్నల్.. తేల్చిచెప్పిన దీపాదాస్ మున్షీ

by Satheesh |
ఎమ్మెల్యేల చేరికలకు AICC గ్రీన్ సిగ్నల్.. తేల్చిచెప్పిన దీపాదాస్ మున్షీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయని, ఇకపైన కూడా కొన్ని చేరికలు ఉంటాయని, దీనిపై పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరిగాయని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీలో మొదటి నుంచీ ఉన్న లీడర్లు, కేడర్‌కు ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటామని, ఆ బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉన్నదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవడంపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్‌గా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మనస్తాపం కలిగింది నిజమేనని అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమైన తర్వాత దీపాదాస్ మున్షీ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల ఎమ్మెల్యే చేరిక విషయంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అమర్యాదగా, అవమానకరంగా ఫీల్ అయ్యారని, దీన్ని పార్టీ నాయకత్వం గుర్తించిందని, ఆయనను కించపర్చడం, ఆయన ప్రాధాన్యతను తగ్గించడం పార్టీ ఉద్దేశం కాదన్నారు. పార్టీలో ఆయన సీనియర్ నాయకుడనేది నిస్సందేహమన్నారు. ఇకపైన ఇలాంటి చేరికల సమయంలో అక్కడి లోకల్ నేతలతో ముందుగా మాట్లాడాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పీసీసీ చీఫ్ మార్పుపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు దీపాదాస్ మున్షీ బదులిస్తూ, దీనికి పదవీకాలం ముగింపు అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదని, హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. పీసీసీ చీఫ్ బాధ్యతలు, మార్పు విషయంలో అధిష్టానానికి స్పష్టమైన అవగాహన ఉన్నదన్నారు.

Next Story

Most Viewed