శ్రీహరి రావు రాజీనామాతో నిర్మల్ పాలిటిక్స్‌లో అలజడి..

by Mahesh |
శ్రీహరి రావు రాజీనామాతో నిర్మల్ పాలిటిక్స్‌లో అలజడి..
X

దిశ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. నిన్నటిదాకా నిర్మల్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, భారత్ రాష్ట్ర సమితి పార్టీల నడుమనే పోటీ ఉంటుందని భావించారు. అధికార పార్టీకి శ్రీహరి రావు రాజీనామా చేయడం త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే అని తెలుస్తుండడంతో నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ తప్పదని స్పష్టం అవుతుంది. ఆయన రాజీనామా అధికార పార్టీని ఇబ్బందులు పెడుతుందా... ఓటు చీలిక అస్పష్టంగా ఉండి బీజేపీకి నష్టం చేకూరుస్తుందా ఈ రెండు పార్టీలు కాదని రాజకీయ పరిణామాలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యే ముందుకు దూసుకు వస్తుందా అన్నది తెలియని రాజకీయ అయోమయ పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.

అధికార పార్టీకి షాక్..

శ్రీహరి రావు రాజీనామా అధికార భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో కొనసాగుతున్న శ్రీహరి రావు రెండు సార్లు నిర్మల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2018లో మాత్రం టికెట్ ఆయనకు దక్కకపోయినప్పటికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజయం కోసం కృషి చేశారు. ఆ తర్వాత కూడా వారి నడుమ విభేదాలు కొనసాగాయి. శ్రీహరి రావు అధికార పదవితో పాటు పార్టీ పరమైన పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైంది. అప్పటి నుంచి ఆయన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తాజాగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయన అధికార పార్టీకి పని చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ శ్రీహరి రావు తీసుకున్న తాజా నిర్ణయం అధికార పార్టీలో తీవ్ర కుదుపునకు దారితీసింది. ఇది ఆ పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మరోవైపు శ్రీహరి రావు తమపై అలాగే ఆగ్రహంతో ఉన్నారని ఆయన తరఫున వచ్చే ఓట్లు తమ బలమైన ప్రత్యర్థి బిజెపికి వెళ్లకుండా ఉంటే చాలు అన్న అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు.

బీజేపీలో పెరుగుతున్న ఆశలు

శ్రీహరి రావు రాజీనామాతో భారతీయ జనతా పార్టీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థి లేకపోతే మైనార్టీలు క్రిస్టియన్లు మరో రెండు సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తగా భారత రాష్ట్ర సమితికి పోలవుతాయని బీజేపీ భయపడింది. తాజాగా శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని తెలుస్తుండడంతో తాము లాభపడతామని బీజేపీ భావిస్తోంది. ఈ సామాజిక వర్గాల ఓట్లు చీలిపోవడం లేదంటే కాంగ్రెస్ వైపు ఎక్కువగా పోలైతే తమకు భారీ లాభం చేకూరుతుందని బీజేపీ అంచనా వేస్తోంది.

ఇద్దరినీ కాదని...

అటు బీజేపీ ఇటు భారత్ రాష్ట్ర సమితి పార్టీలను కాదని తామే లాభపడతామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇంతకాలం బలమైన అభ్యర్థి లేకపోవడంతో పార్టీ పరిస్థితి అంతంత గానే ఉందని భావించారు. అయితే శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయనకు నియోజకవర్గంలో బలమైన అనుచర గణం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. మైనార్టీల ఓటు బ్యాంకు ప్రభావంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకు భారీగా లాభం చేకూరుస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఇటీవల కర్ణాటక ఫలితాలు కచ్చితంగా తమకు అనుకూలంగా మారుతాయి అని కూడా భావిస్తున్నారు. ఇద్దరినీ కాదని తామే ముందుకు దూసుకు వస్తామన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed